calender_icon.png 28 October, 2024 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరకలెత్తిన కృష్ణమ్మ.. ఉప్పొంగిన గోదావరి

22-07-2024 12:24:40 AM

  1. రాష్ట్రంలో కుండపోత వర్షాలు
  2. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  3. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రాక 
  4. భద్రాచలం వద్ద 44.4 అడుగులకు చేరిన గోదావరి 
  5. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 
  6. మరో మూడురోజులూ వర్షాలే
  7. వెల్లడించిన వాతావరణ కేంద్రం
  8. కొన్ని ప్రాంతాల్లో స్తంభించిన జన జీవనం 

* రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి పరివాహప్రాంతాల ప్రజలకు వరద భయం పట్టుకున్నది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరదల నేపథ్యంలో ప్రజలెవ్వరూ అవసరం లేనిదే బయటకు రావొద్దని, జలాశయాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

విజయక్రాంతి న్యూస్‌నెట్‌వర్క్, జూలై 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 44.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 9,74,666 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీవో రాహూల్ కరకట్టపై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది.

సోమవారం మధ్యాహ్నానికి 46 అడుగులు చేరుకొంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద పెరగడంతో భద్రాచలం సబ్‌కలెక్టర్, ఐటీడీఏ, కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ముంపు ప్రాంతాలైన దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, కాశీనగరం గ్రామాల ప్రజలను ఆదివారం సాయంత్రం పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం నుంచి చర్ల, వెంకటా పురం, వాజేడు, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారిపై గోదావరి బ్యాక్‌వాటర్ నిలిచింది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు పొంగి ప్రవహించడంతో పర్ణశాలలోని సీతమ్మనారా చీరల ప్రాంతం వరదనీటిలో మునిగింది. 

 పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం

కరీంనగర్ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. హుజూ రాబాద్ మండలం బొంపల్లిలో అత్యధికంగా 6.13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై వర్షపునీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల జన జీవనం స్తంభించింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలంలో పాకాల చెరువు నీటి సామర్థ్యం 30 అడుగులు కాగా 21.9 అడుగులకు చేరింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం 55.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

జూన్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 364.7 మిల్లీ మీటర్లు కాగా 416.9 మిల్లీ మీటర్లు అంటే 14 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో 76.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సారంగపూర్‌లో అత్యధికంగా 124.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమో దైంది. ఖానాపూర్‌లో అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్క వాగు ప్రవహించడంతో రాకపోక లు నిలిచిపోయాయి. వేములవాడ గంజివాగు వద్ద రోడ్ల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో బోయిన్‌పల్లి రూట్‌లో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వరద ఉధృతితో జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాల్లోని అనేక మారుమూల ఏజెన్సీ గ్రామాల కు రాకపోకలు నిలిచిపోయాయి.

183వ జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద పోలీసులు భారీకేట్లు ఏర్పాటు చేసి రాకపోకలకు బ్రేక్ వేశారు. హైదరాబాద్ భూపాల పట్నం జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఓసీపీ ప్రాజెక్టుల్లో నాలుగు రోజులుగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలో మూడ్రోజులుగా వాన దంచి కొడుతుంది. మంథని నియోజక వర్గంలోని కమాన్పూర్ మండలం గుండారం రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా నిండిపోయి కట్టపై నుంచి నీరు బయటకు ప్రవహించే ప్రమాద స్థాయికి చేరుకుంది. పెద్దపల్లి మండలం సబ్బితం గట్టు సింగారం గౌరీ గుండాల జలపాతం వద్ద వరద ఉధృతి పెరుగుతుండటంతో నిషేధం ప్రకటించారు. రామగుండం రీజీయన్‌లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నది.

  1. రాష్ట్రంలో ఎడతెగని వానలు
  2. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  3. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
  4. కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న ఇన్‌ఫ్లోలు
  5. మరో మూడురోజులూ వర్షాలే 
  6. వెల్లడించిన వాతావరణ శాఖ వెల్లడి
  7. కొన్ని ప్రాంతాల్లో స్తంభించిన జనజీవనం 
  8. బొక్కి వాగులో గల్లంతై ఒకరి మృతి
  9. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ఆదివారం సాయంత్రం ౪.౮౭ లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది. భద్రాచలం వద్ద ౪౪.౪ అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు కృష్ణా బేసిన్‌లోనూ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. జూరాలకు ఎగువ నుంచి ౧.౧౦ లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అధికారులు ౨౭ గేట్లు ఎత్తి ౧.౧౯ లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ౧.౨౦ లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.     నెట్‌వర్క్