calender_icon.png 20 November, 2024 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలత చెంది.. కన్నీరు మిగిల్చి!

20-11-2024 12:00:00 AM

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు 

ప్రతి ఒక్కరి కల. అలాంటి కల 

నిజమవుతున్న తరుణంలో సీమ్రాంధ్ర నాయకులు కుట్రలకు తెరలేపడం, తెలంగాణను 

అడ్డుకోవడంతో జీర్ణించుకోలేకపోయాడు ఉద్యమకారుడు వడ్ల నాగభూషణం. ‘నా చావుతోనైనా తెలంగాణ సిద్ధించాలి’ అంటూ ఆత్మబలిదానం చేసుకొని ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. 


కామారెడ్డి జిల్లా గర్గుల్‌కు చెందిన వడ్ల లక్ష్మీ, కిష్టయ్యలకు పెద్దకుమారుడైన వడ్ల నాగభూషణం వండ్రంగి పనిచేసేవాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉద్యమకారుడిగానే కాకుండా.. పాఠశాల కమిటీ మెంబర్‌గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను మోశాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లికి చెందిన గంగామణిని పెళ్లి చేసుకున్నాడు.

ముగ్గురు పిల్లల సంతానం. నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే, మరోవైపు వడ్రంగి వృతిని కొనసాగించాడు. తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై కామారెడ్డిలో పలు ఆందోళన కార్యక్రమాలు చేశాడు. రీలే నిరహర దీక్షల్లోనూ పాల్గొన్నాడు. అయితే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే సమయంలో సీమాంధ్ర నాయకులు అడ్డుపడటంతో కలత చెందిన నాగభూషణం తన చావుతోనైనా తెలంగాణ ఉద్యమం ఉధృతం కావాలనుకున్నాడు.

సూసైడ్‌నోట్ రాసి తన వ్యవసాయం పొలంలో 2011, జూలై 18న చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఈ సందర్భంగా నాగభూషణం భార్య వడ్ల గంగమణి తన భర్త మరణాన్ని తలుచుకుంటూ ఉద్యమ సంగతులను పంచుకున్నారిలా..

ఉద్యమంలో చురుకైన పాత్ర

నాభర్త మొదట్నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. సీమాంధ్ర నాయకులు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని పదే పదే బాధపడేవాడు. నా భర్త చనిపోయిన విషయం ఊరోళ్లు చెప్పేదాకా తెలియదు. ఆత్మబలిదానం చేసుకునే సమయంలో నేను కూలీకెళ్లాను. రోజులాగే ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడే అనుకన్న తప్ప.. ఉరేసుకొని చనిపోతాడని అనుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు, ధర్నాలు చేయడమే కాదు.. తబలా వాయించి ఎంతోమందిని ఆకర్షించాడు.

కామారెడ్డి జిల్లాలోనే తబలా ఆర్టిస్టుగా మంచి పేరుంది. ‘నాగభూషణం తబలా వాయిస్తే కిక్కే వేరు’ అని ఉద్యమకారులు మెచ్చుకునేవారు. కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి మరీ ఎక్కడ ఏ సభ జరిగినా వెళ్లేవాడు. ఓసారి కేసీఆర్ మా ఊరికి వస్తే నా భర్త నాగలి గుర్తు తయారుచేసి మరీ బహమతిగా ఇచ్చాడు. ఉదయం వెళ్తే.. అర్ధరాత్రికి ఇంటికొచ్చేవాడు. అంతేకాదు.. మరుసటిరోజు ఉద్యమ విషయాలను పూసగుచ్చినట్టుగా వివరించేవాడు.

ఒంటరిగా మిగిలా

ఎంతో మందికి ధైర్యం చెప్పే నా భర్త చనిపోతాడని కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక  చిన్న కొడుకుకు కొలువు వచ్చింది. పది లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ పోయినొడు మాత్రం రాడుకదా. ఇద్దరు కొడుకులు వడ్రంగి పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నా. నా భర్త చనిపోయిన తర్వాత పింఛన్ వచ్చేది. అయితే చిన్న కొడుకుకు ఉద్యోగం రావడంతో పింఛన్ కట్ అయ్యింది. ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్న కాబట్టి పింఛన్ ఇస్తే బాగుంటది.   

- మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి