calender_icon.png 24 December, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో..యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ సెమినార్

24-12-2024 02:01:36 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎమ్‌సీ)లో మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా అనే అంశంపై సోమవారం ‘యూపీఎస్సీ మాస్టర్ క్లాస్’ సెమినార్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణ ప్రదీప్ విద్యార్థులతో మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కావడం ద్వారా సమాజ సేవకు న్యాయబద్ధమైన అధికారం లభిస్తుందని చెప్పారు. తన ప్రసంగంలో ఆయన 2017 సివిల్ సర్వీసెస్ టాపర్, ప్రస్తుత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిష్కరించిన ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఓ వృద్ధ దంపతులు తమ పిల్లల వల్ల ఇల్లు కోల్పోయినప్పుడు 2007 చట్టం కింద కలెక్టర్ దురిశెట్టి చొరవ చూపి, వారికి తిరిగి న్యాయం అందించడంతోపాటు వారి ఆస్తిని తిరిగి పొందేలా చేశారని, ఈ ఉదాహరణ సివిల్ సర్వీసెస్‌లో ఉన్న అధికారానికి నిదర్శనమని ఆయన తెలిపారు.

అకాడమీ చీఫ్ మెంటార్ డాక్టర్ భవాని శంకర్ మాట్లాడుతూ.. పరీక్ష పాసయ్యే దానికి క్రమశిక్షణ చాలా అవసరమని, దానిపై విద్యార్థులు దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో 21 సెంచరీ అకాడమీ నిపుణులు రూపొందించిన ప్రత్యేక పుస్తకాలను లాంచ్ చేశారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కే రఘువీర్ అధ్యక్షత వహించి విద్యార్థులకు విలువైన సలహాలు అందించారు. వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ డీ తిరుమల రావు, డాక్టర్ జీ సంతోషి, జీ5 మీడియా డైరెక్టర్లు గిరి ప్రకాశ్, గణేశ్ పాల్గొన్నారు.