calender_icon.png 20 November, 2024 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టులో ఉప్పల్ ఫ్లుఓవర్ టెండర్లు

29-06-2024 12:42:48 AM

  1. ట్రిపుల్ ఆర్ సహా రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి
  2. ఇబ్బందులు ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
  3. త్వరగా పనులు చేస్తే ప్రజల మన్నన లభిస్తుంది
  4. అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): రహదారుల సమస్యల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతుంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం తగదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మనం నిర్మించే ప్రతి రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతే సర్కారు ఎందుకని పేర్కొన్నారు. హైదరాబాద్ న్యాక్‌లో జాతీయ రహదారుల పనులపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైదరాబాద్ (ఎన్‌హెచ్ జాతీయ రహదారి, ఎన్‌హెచ్ 163 పరిధిలో ఎన్జీటీ ఆదేశాల మేరకు వృక్షాల రీ లొకేషన్, మంచిర్యాల ఆర్మూర్ జాతీయ రహదారి పనులపై సమీక్షించారు.

ట్రిపుల్ ఆర్ విషయంలో మరింత చురుగ్గా పనులు చేయాలని మంత్రి ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభమైతే రాష్ట్రానికి ఎంటర్‌టైన్మెంట్ జోన్లు, డిస్నీల్యాండ్ వంటి ప్రపం చ ప్రఖ్యాత సంస్థలు, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పడి రాష్ర్టం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని మంత్రి అధికారులకు చెప్పారు. ట్రిపుల్ ఆర్ విషయంలో అధికారులు ప్రతి అంశాన్ని క్షణ్ణం గా అధ్యయనం చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనులను ముం దుకు తీసుకుపోదామని సూచించారు. ఎన్‌హెచ్ సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఫోర్ క్లోజ్ చేసి వచ్చే నెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇందులో ఎలాంటి అవంతరాలు ఎదురుకాకుండా ప్రతిదీ నిత్యం పర్యవేక్షించాలని జాతీయ రహదారుల సంస్థ ఆర్వో రజాక్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆగస్టులో ఫ్లుఓవర్ టెండర్లు 

ఉప్పల్- ఫ్లుఓవర్ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు టెండర్లు ఫోర్ క్లోజ్ చేసి కొత్త టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా సంస్థలను ఖరారు చేసి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఫ్లు ఓవర్ పనులనకు ఆగస్టులో కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. కొడంగల్ నుంచి హైదరాబాద్ మీదుగా భూపాలపట్నం వరకు ఎన్‌హెచ్ 163 పరిధిలో హైదరాబాద్ నుంచి మన్నెగూడ విస్తరణకు మార్గం సుగమం చేసేందకు ఎన్జీటీ ఆదేశం మేరకు 915 వృక్షాల రీలొకేషన్ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎన్‌హెచ్, అటవీ శాఖలను సమన్వయం చేసి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.

మన్నెగూడ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇబ్బందులు ఉన్న చోట సమస్యల్ని పరిష్కరిం చేందుకు మార్గం వెతకాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అటవీ శాఖ అనుమతుల కోసం జూలై మొదటి వారంలో రాష్ట్రానికి జాతీయ రహదారుల ప్రాధికార కమిటీ వస్తోందని మంత్రి తెలిపారు. ఎల్బీనగర్ మల్కాపూర్ 6 లేన్ పనులకు అడ్డుగా ఉన్న పైప్‌లైన్, విద్యుత్ లైన్‌కు సంబంధించి అధికారులతో కోమటిరెడ్డి మాట్లాడారు. వారంలో సమస్యలన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకునాలని, పనులన్నీ తొందరగా ప్రారంభం కావాలని ఆదేశించారు. ఆర్మూర్- మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావల్సి ఉండగా ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని చెప్పిన అధికారులు మిగతా పనులను ఈ నెలలో పూర్తి చేస్తామని వివరించారు.