calender_icon.png 3 November, 2024 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగితపు కంపెనీలో కల్లోలం!

03-11-2024 12:39:59 AM

  1. లారీ ఓనర్స్, యాజమాన్యానికి మధ్య వార్
  2. ఫలించని కలెక్టర్, ఎస్పీల చర్చలు
  3. కోర్టుకెక్కిన పంచాయితీ

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలో సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న పంచాయితీ నెల రోజులు అవుతు న్నా పరిష్కారం కావడంలేదు. ఇరువర్గాలను నచ్చజెప్పేందుకు కలెక్టర్, ఎస్పీల సమక్షంలో జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదు. 

2014లో షట్‌డౌన్.. 2018లో ప్రారంభం

మిల్లును 1935లో నిజాం పాలనలో ఏర్పాటు చేయగా 1940లో ప్రారంభం అయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మిల్లును బిర్లా సంస్థ నడిపించింది. 2014 సెప్టెంబర్ 26 వరకు కొనసాగించిన బిర్లా యాజమాన్యం సెప్టెంబర్ 27న షట్‌డౌన్ ప్రకటించింది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కంపెనీ మూతపడటంతో మిల్లులో పని చేసి న కార్మికుల పరిస్థితి అద్వాన్నంగా మారింది.

బీఆర్‌ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప అప్పటి ప్రభుత్వాన్ని  ఒప్పించి మిల్లును ప్రారంభించేందుకు కృషి చేశారు. దీంతో జేకే సంస్థ మిల్లును కొనుగోలు చేయగా అప్పటి ప్రభుత్వం రాయి తీలు సైతం ఇచ్చింది. అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2018 ఆగస్టు 2న కంపెనీని ప్రారంభించారు. 

2018లో ఒప్పందం

కంపెనీ పున:ప్రారంభం అనంతరం మిల్లులో ఉత్పత్తి అయ్యే సరుకును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్‌తో 2018లో ఒప్పందం కుదిరింది. కంపెనీ ప్రారంభంలో సరుకు ఎగుమతి, దిగుమతులకు స్థానిక  లారీ ఓనర్స్‌కే ప్రాధాన్యమిస్తామని చెప్పిన యాజమాన్యం దాన్ని విస్మరించినట్లు ఆరోపణలు న్నాయి.

2019లో నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ చెల్లిస్తుండటంతో సెప్టెంబర్ 25న లారీ ఓనర్స్ సమ్మెకు దిగారు. కంపెనీ నుంచి 238 ప్రాంతాలకు సరుకు రవాణా జరుగగా కేవలం 14 ప్రాంతాలకు మాత్రమే స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్‌కు ఇవ్వడంతో 180 లారీలు ఉన్న అసోసియేషన్‌లో రోజు కు సగటున నాలుగు నుంచి ఐదు లారీలకు మాత్రమే సరుకు రవాణా చేసేందుకు అవకాశం వస్తున్నది.

మిగిలిన లారీలకు అవ కాశం వచ్చేందుకు దాదాపు 20 రోజుల సమయం పడుతున్నది. దీంతో గిట్టుబాటు కాక 37 స్థానాలకు సరుకు రవాణా చేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు కిరా యిలను పెంచాలని ట్రాన్స్‌పోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో కంపెనీ యాజమా న్యానికి అవసరం లేకన్నా ట్రాన్స్‌పోర్టు కిరాయిల ఒప్పందం జరుగకుండా అడ్డుకుం టుందని లారీ ఓనర్లు ఆరోపిస్తున్నారు.

గత నెల 25న లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మె కు పిలుపునిచ్చింది. దీంతో లోడ్ అయ్యిన 30 లారీలు సైతం నిలిచిపోయాయి. దీంతో పేపర్ మిల్లు యాజయాన్యం కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నది. లోడ్ చేసిన లారీలు సదరు ప్రాంతాలకు వెళ్లి దిగుమతి చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే లారీ ఓనర్స్ అసోసియేషన్ సరుకును దిగుమతి ప్రాంతాలకు పంపించకుండా కంపెనీ యాజమాన్యానికే అప్పగించింది. 

లే ఆఫ్ దిశగా యాజమాన్యం?

మిల్లు లే ఆఫ్ చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మిల్లులో నాలుగు పేపర్ ఉత్పత్తి యంత్రాలు పని చేస్తున్నాయి. గత నెల 28న మూడు యంత్రాలు, 29న నాలుగో యంత్రాన్ని మరమ్మతుల కారణం చూపుతూ నిలిపివేసినట్లు తెలిసింది. రైలుమార్గం ద్వారా పేపర్ ను రవాణ చేసేందుకు రైల్వే ట్రాక్ మరమ్మతులు కోసం రైల్వే అధికారులను యాజ మాన్యం సంప్రదించినట్లు సమాచారం. 

ఏకపక్షంగా యాజమాన్యం..

కంపెనీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాలు, లారీ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కంపెనీలో 1,200 మంది కార్మి కులు ఎన్సీఎల్పీ అగ్రిమెంట్ ప్రకారం పని చేయాల్సి ఉండగా ప్రస్తుతం 450 మంది తో కంపెనీని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పని చేసిన 200 మంది రెగ్యులర్ కార్మికులను ఇప్పటికీ విధుల్లోకి తీసుకోలేదు.

అంతే కాకుం డా కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరేండ్లు గడిచినా కార్మి క సంఘం ఎన్నికలను నిర్వహించకుండా అలసత్వం వహిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వర్కర్ల సొసైటీని సైతం ఎత్తివేసినట్లు సమాచా రం. స్థానికులకు ఉపాధి కల్పించాల్సిన యాజమా న్యం ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తెచ్చి పని చేయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. 

కంపెనీ విధానం మార్చుకోవాలి

కంపెనీ యాజమాన్యం మొండి వైఖరిని మార్చుకోవాలి. లారీల కిరాయిల విషయంలో కంపెనీకి ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ ట్రాన్స్‌పోర్టులను బెదిరింపులకు గురి చేస్తూ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా చేస్తున్నది. మేం 2019లో నిర్ణయించిన కిరాయిలను పెంచాలి. ట్రాన్స్‌పోర్ట్ కిరాయిలు పెంచేవరకు ఉద్యమం కొనసాగుతుంది.

 వన్నె కిశోర్‌బాబు,

లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు,

కాగజ్‌నగర్