మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కేంద్రాలను సందర్శించి టీకాలు అందిస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఉపకేంద్రములు సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలన్నారు. మంచిర్యాల పట్టణంలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు వైద్య సిబ్బందితో చేస్తున్న సర్వే రిపోర్టు లను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి ఇంట్లో వారితో మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని, జ్వరం లాంటి లక్షణాలున్నవారికి ఆర్డీ కిట్లతో పరీక్షలు చేయాలని, సరైన మందులను అందజేయాలని, మూడు రోజుల కన్నా ఎక్కువ జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలన్నారు.
ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి పరిసరాల చుట్టూ, ఇంట్లో నీరు నిలువ లేకుండా చేసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని, నీటిని వేడి చేసి చల్లార్చిన తరువాత తాగాలని ప్రజలకు సూచించాలన్నారు. ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది తిరుగుతూ తగు సూచనలను తెలియజేయాలని ఆదేశించారు. అదే విధంగా చిన్నపిల్లల్లో చాలామందికి వైరల్ జ్వరాలు రావడం జరుగుతుందనీ, కావున పిల్లలకు తగు జాగ్రత్తలను తీసుకోవాలని అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో మందులను నిలువ ఉంచుకోవాలని, వ్యాక్సిన్ 100 శాతం పిల్లలకు ఇవ్వాలని, గర్భవతులను నమోదులో 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డెమో వెంకటేశ్వర్లు, డాక్టర్ శివ ప్రతాప్, పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, సర్వే కార్యక్రమంలో పాల్గొంటున్న స్టాప్ నర్సులు వెంకట్, సాయి, తదితరులు పాల్గొన్నారు.