రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర'. ధమాకాతో మంచి హిట్ అందుకున్న ఈ మాస్ మహారాజ్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్' వంటి సినిమాలు మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నాయి. ఇటీవల హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' ఒక్కటి మాత్రం సంగీతం పరంగా కావచ్చు.. కొత్తందం భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కావచ్చు.. కొద్దో గొప్పో ప్రేక్షకాదరణకు నోచుకుంది. మిగతావన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయితే రవితేజ ఇప్పుడు 'మాస్ జాతర'తో థియేటర్లలో అభిమానులకు పూనకాలు పుట్టించేందుకు వచ్చేస్తున్నాడు. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాస్ జాతర’తో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు మాస్ మహారాజ్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఇది రూపొందుతోంది.
రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావటం వల్ల దీనిపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. తమ అభిమాన హీరోకు మైల్ స్టోన్ మూవీ కాబట్టి అతిపెద్ద విజయాన్ని అందుకోవాలన్న ఆకాంక్ష అభిమానుల్లోనూ కనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన కిస్సిక్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలావుండగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గ్లింప్స్ వదలనున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న కారణంగా.. చిత్రబృందం ప్రచార పర్వానికీ తెలంగాణ యాసకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన గ్లింప్స్ రిలీజ్ అనౌన్స్ మెంట్ ను సామాజిక మాధ్యమాల వేదికగా చేసింది మూవీ యూనిట్. ఈ పోస్టర్ కు 'రవన్న మాస్ దావత్ షురూ రా భయ్..' అంటూ తెలంగాణ స్టైల్ లోనే వ్యాఖ్యను జోడించటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పోస్టరూ.. ఈ వ్యాఖ్యను బట్టి చూస్తుంటే.. అభిమానులకు నిజంగా దావత్ ఉన్నట్టేననే ముచ్చట అర్థమైపోతోంది.