28-03-2025 12:26:51 PM
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా(Sant Kabir Nagar District)కు చెందిన బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధిక వివాహం ఆమె ప్రేమికుడు విశాల్ కుమార్‌తో జరిపించిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్(Viral) అయిన ముచ్చట తెలిసిందే. తన నిర్ణయం వెనుక గల కారణాన్ని బబ్లూ ఇటీవల ఒక ప్రకటనలో వివరించారు. ఈ మధ్య కాలంలో, భార్యలు తమ భర్తలను చంపడం మనం చూశామని బబ్లూ మీడియాకి తెలిపారు. మీరట్‌లో ఇటీవల జరిగిన సంఘటనలో ముస్కాన్ అనే యువతి తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేసి, అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను డ్రమ్‌లో దాచిపెట్టిందని ఆరోపించారు.
మీరట్‌లో ఏమి జరిగిందో చూసిన తర్వాత, మనమందరం ప్రశాంతంగా జీవించగలిగేలా నా భార్యను ఆమె ప్రేమికుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నానని బబ్లూ తెలిపాడు. వేరే రాష్ట్రంలో కూలీగా పనిచేసే బబ్లూ 2017లో రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాలక్రమేణా, రాధిక విశాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెంచుకుంది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న బబ్లూ ఆమెను మందలించాడు. కానీ రాధిక విశాల్‌తో తన సంబంధాన్ని ముగించడానికి నిరాకరించింది. దీంతో భద్రతా కారణాలను చూపుతూ బబ్లూ వారి వివాహాన్ని స్వయంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. తనకు హాని జరగకూడదని అతను చెప్పాడు. అందుకే వారి వివాహాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నానని వెల్లడించాడు. బబ్లూ ప్రకారం, మొదట రాధిక, విశాల్ కుమార్ వివాహాన్ని కోర్టులో తానే నిర్వహించాడు. తరువాత, వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లాడు, అక్కడ వారు దండలు మార్చుకున్నారు. తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి సూట్ కేసులో కుక్కిన దారుణ ఘటన వెలుగుచూసింది.