14-03-2025 11:46:11 PM
గూఢచర్యం ఆరోపణలతో యూపీలో వ్యక్తి అరెస్ట్
పాక్‌కు మిలటరీ రహస్యాలు లీక్ చేసిన వైనం
ఫిరోజాబాద్: పాకిస్థాన్ ఐఎస్‌ఐకి గూఢచర్యం చేస్తూ భారత రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తర్ ప్రదేశ్‌లో రవీంద్ర కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హనీట్రాప్‌లో చిక్కిన సదరు వ్యక్తి భారత మిలటరీకి సంబంధించిన రహస్యాలను పాక్‌కు అందించినట్లు విచారణలో తేలింది. విషయంలోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్‌లో హజ్రత్‌పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది ఆతడికి నేహా శర్మ అనే మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. పాక్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టి రవీంద్రతో స్నేహం చేసింది. డబ్బుల ఆశ జూపి వలపు వల విసిరింది.
అనంతరం అతడి నుంచి మిలటరీ రహస్యాలను సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ పరీక్షలు, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్ కమిటీ పంపిన రహస్య లేఖలను సంపాదించి వాటిని ఆ మహిళకు వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. ఇందులో గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఐఎస్‌ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వారికి పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.