calender_icon.png 17 January, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజూ అప్

16-01-2025 01:47:28 AM

మరో 224 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

23,2000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ

ముంబై, జనవరి 15: ప్రపంచ సానుకూల సంకేతాల నేపథ్యంలో రూపాయి బలపడటం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర దిగిరావడం తదితర అంశాలతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ లాభపడింది. రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్  ఇంట్రాడేలో 76,991 76,499 పాయింట్ల మధ్య  ఊగిసలాడింది.. చివరకు మరో 224  పాయింట్ల లాభంతో  76,724 పాయింట్ల వద్ద నిలిచింది.  నిఫ్టీ ఇంట్రాడేలో23,293  పాయింట్ల హెచ్చుతగ్గులకు లోనై  చివరకు 23,200 పాయింట్ల కీలకస్థాయి ఎగువన 37 పాయింట్ల లాభంతో 23,213 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

ఇండెక్స్ హెవీవెయిట్లు కోటక్ బ్యాంక్, జొమాటో, రిలయన్ప్ ఇండస్ట్రీస్‌లో  కొనుగోళ్ళు జరగడంతో సూచీలు ర్యాలీ జరిపాయని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. క్రూడ్ ధరలు తగ్గడం, డాలర్ ఇండెక్స్ బలనంగా ట్రేడ్‌కావడం సెంటిమెంట్‌ను  మెరుగుపర్చిందన్నారు.మంగళవారం సెన్సెక్స్ 491 పాయింట్లు, నిఫ్టీ 37  పాయింట్లు చొప్పున పెరిగాయి.

   ట్రంప్ అనుసరించే వాణిజ్య విధానాల పట్ల ఆందోళన మార్కెట్  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారత్ మార్కెట్ విలువలు ఈ స్థాయిలో కూడా ఖరీదుగా ఉండటంతో ఆందోళనచెందుతున్న ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 79 డాలర్లకు చేరగా, డాలరు మారకంలో రూపాయి విలువ 86 స్థాయికి పడిపోయింది. 

ఏడు రోజుల్లో రూ.28,000 కోట్లకు పైగా ఎఫ్‌పీఐ విక్రయాలు

దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్లో జోరుగా విక్రయాలు జరుపుతున్నారు.  మంగళవారం ఒక్కరోజులోనే రూ.8,000 కోట్లు పెట్టుబడులు వెనక్కు తీసుకున్న ఎఫ్‌పీఐలు బుధవారం మరో రూ.4,532 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ వారం వరుస ఏడు రోజుల్లో వీరి నికర అమ్మకాలు రూ.28,000 కోట్లు మించాయి. 

డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 109పైకి చేరగా, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.8 శాతానికి పెరిగిందని తెలిపారు. 

రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.  

జొమాటో 4 శాతం జంప్

సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా జొమాటో 4 శాతం ర్యాలీ జరిపింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్ప్ ఇండస్ట్రీస్, మారుతి, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీలు 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్,  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్‌లు క్షీణించాయి.

వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 2.45 శాతం పెరిగింది.    పవర్ ఇండెక్స్ 2.08 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.58 శాతం, ఐటీ ఇండెక్స్ 0.76 శాతం చొప్పున లాభపడ్డాయి. హెల్త్‌కేర్, లాభపడింది. ఎఫ్‌ఎంసీజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్0.11 శాతం చొప్పున  పెరిగాయి.