లక్నో: ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ హోటల్‌లో ఒకే కుటుంబానికి(UP Familicide) చెందిన ఐదుగురు వ్యక్తులు శవమై కనిపించారు. తల్లి, నలుగురు చెల్లెళ్లను యువకుడు హతమార్చాడు. లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త సంవత్సరం(Happy New Year 2025) సందర్భంగా ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. "అర్షద్ (24)గా గుర్తించబడిన నిందితుడు తన సొంత కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని స్థానిక పోలీసులు వెంటనే అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner) రవీనా త్యాగి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని నిందితుడు పోలీసులు చెప్పాడు. మృతులను అస్మా, తొమ్మిదేళ్ల అలియా, 19 ఏళ్ల అలీషా, 16 ఏళ్ల అక్సా ,18 ఏళ్ల రహ్మీన్‌గా గుర్తించారు.
డిసిపి ప్రకారం.. ఆగ్రాకు చెందిన అర్షద్ గృహ వివాదాల కారణంగా ఈ హత్యలు చేశాడని తెలిపారు. సమీపంలో ఉన్న హోటల్ సిబ్బందిని కూడా విచారిస్తున్నామని, ఏదైనా తాజా సమాచారం వెలుగులోకి వస్తే తక్షణమే మీడియాతో పంచుకుంటామని జాయింట్ పోలీసు కమిషనర్ (Crime, Headquarters) బబ్లూ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల శరీరంపై ఒకరి మణికట్టుపై, మరొకరి మెడపై గాయాల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో అర్షద్ తండ్రి బదర్‌ను కూడా పోలీసులు(Police) అనుమానితుడిగా పేర్కొన్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆహారంలో మత్తుమందు ఇచ్చి కుటుంబాన్ని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.