ఎప్పుడైనా చూశారా సిటీ బస్సు స్థితి
గంపెడు పిల్లలను కడుపున మోసే కన్నతల్లిలా
ఎంత అపసోపాలు పడుతూ నడుస్తుందో
ఎన్నో జీవితగమ్యాలకు సాక్ష్యమయ్యే బస్సు
రోడ్దుమీద తిరిగే దేశ దిమ్మరీ
ఆ నడకకు భూమి బారులుగా దారినిచ్చు
ఆ స్పర్శకు జనహృదయం కొత్త స్పూర్తినొందు
రెక్కలు లేకున్ననేమి చుక్కల దాక సాగు
ఎక్కడెక్కడికో పయనించు ప్రజలను
తమ గమ్యస్థానాలలో దింపు బస్సు
జీవిత పరమార్థం తెలుపు యోగి
దిక్కులను కలుపు హరివిల్లు
ఎప్పుడైనా చూశారా బస్సు ప్రయాణీకుల స్థితి
వాళ్ళు బస్సులలో పోవడం లేదు
బాధ్యతల గుఱ్ఱాలపై పోతున్నారు
ఆ బస్సు బరువులను మోయడం లేదు
ఎన్నో కష్టాలను, కన్నీళ్లను మోస్తుంది
మరెందరెందరో అలోచనలను మోస్తుంది
ఖాళీ అగుతూ బోసిగా నవ్వే బస్సు
అప్పగింతల నాటి తల్లిదండ్రుల పోలు
రాలిపోయిన పూలదండలా
పక్షిగూళ్ల లాంటి పట్టేడు వాహనాలేన్ని వున్నా
పుష్పక విమానమై తిరుగాడే బస్సు కల్పవల్లీ
మనిషి తత్వమల్లా మరతత్వమవుతున్న వేళ
మౌనాన్ని ఛేదిస్తూ పలకరింపులతో కలిపే
బస్సు స్వచ్ఛ రాయబారి
ఎన్నో మజిలీలు తనలో దాచుకుని
ఇంకా చమురై నిలుచు బస్సు
తిమిరంలో వెలుగొందు అమరదీపం
ఒక్క బస్సు ప్రయాణించిన చాలు
బీటలు వారిన గ్రామకలలెన్నో నిద్రలేచు
ఒకసారి పరిగెత్తు హరిణమై
ఒకసారి నడుచు నత్తయై
బస్సు పయనం రాయబడనీ దృశ్య కావ్యం
- ఐ.చిదానందం
8801444335