calender_icon.png 18 January, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానరాని ఆర్టీసీ బస్సులు

18-01-2025 12:00:00 AM

  • వెలవెలబోతున్న బస్టాండులు
  • వెల్దుర్తిలో ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూపులు
  • ఉచిత ప్రయాణానికి నోచుకోని మహిళలు

వెల్దుర్తి, జనవరి 17: వెల్దుర్తి మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. మండల కేంద్రం నుంచి దూర ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రయితే దూర ప్రాంతానికి వెళ్లే వారికి బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వెల్దుర్తిలో సుమారు 16 ఏండ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మించారు. గత ఏడాదిలో ఆ బస్టాండ్‌కు ప్రహరీ నిర్మించారు. కానీ  బస్సుల రాకపోకలు పరిశీలించేందుకు ఆర్టీసీ అధికారులు ఎవరినీ నియమించలేదు. దీంతో ఆ బస్టాండు నిరుపయోగంగా మారింది.

మందు బాబులకు అడ్డాగా ..

రాత్రి సమయాలలో మద్యం ప్రియులకు మద్యం సేవించడానికి బస్టాండ్లు అడ్డాగా మారాయి. మండల కేంద్రమైన వెల్దుర్తితో పాటు మంగల్పర్తి, కుకునూర్, మన్నేవారి జలాల్పూర్ తో పాటు ఉప్పులింగాపూర్, దామరంచ గ్రామాల్లోని  బస్టాండ్లలో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆయా గ్రామాల్లో బస్టాండ్లు అధ్వానంగా మారాయి. 

మండల కేంద్రమైన వెల్దుర్తి నుండి ఆయా గ్రామాలకు, వెల్దుర్తి నుండి తూప్రాన్  రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు నడపడం లేదు. పలుమార్లు అధికారులకు, ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. వెల్దుర్తి మండలానికి బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులే కాక ఉచిత ప్రయాణానికి కూడా నోచుకోలేమని మహి ళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి  మండల కేంద్రానికి బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.