మన ప్రజానాయకుల్లో రాన్రాను జవాబుదారీతనం కరువై పోతున్నది. ప్రజాస్వామ్యం బలంగా పని చేయడానికి ముఖ్యమైన పట్టుకొమ్మలలో ఇదొకటి. రాజకీయాలు ఎంత వ్యాపారంగా మారినా, వ్యక్తిగత విలువలు, సద్గుణాల విషయంలో నాయకులే ప్రజలకు మార్గదర్శకులుగా ఉంటారు, ఉండాలి కూడా. ఏదైనా పెద్ద ప్రమాదాలు, తీరని నష్టాలు సంభవించినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం, ప్రజల సందేహాలను తీర్చే విధంగా వ్యవహరించడం, పారదర్శకత పాటించడం వంటివి అన్ని పక్షాల నాయకులకూ అవసరం. ఇకనైనా, ఈ తరహా సంస్కృతిని పాదుకొల్పడానికి ఈ తరం నాయకులైనా ముందుకు రావాలి. ఏది చేసినా ఓట్ల ప్రాతిపదికన చేయడం భావ్యం కాదు.
- గడీల ఛత్రపతి, హైదరాబాద్