calender_icon.png 17 October, 2024 | 10:07 AM

అల్లవాడలో అంటరానితనం

16-10-2024 02:19:58 AM

ఆలయంలోకి వెళ్తుంటే దళితుడిని అడ్డుకున్న అగ్రవర్ణాల వ్యక్తులు

పంచాయితీ పేరుతో పిలిచి కర్రలతో దాడి

చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు

నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై కుల సంఘాల నిరసన

చేవెళ్ల, అక్టోబర్ 15: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆలయంలోకి ప్రవేశించేందుకు నిరాకరించిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లవాడలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామంలోని దుర్గామాత మండపంలో కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన వారిని ఇదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అడ్డుకున్నారు.

పైగా పంచాయితీ పేరుతో బాధితులపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవాడలోని దుర్గామాత ఆలయం గ్రామస్తులకు ఇలవేల్పు. రెండు దశాబ్దాల నుంచి గ్రామస్తులు అమ్మవారిని పూజిస్తున్నారు.

దీనిలో భాగంగానే దసరా రోజు (ఈనెల 12) గ్రామానికి చెందిన దళితుడు బోనగిరి అర్జునయ్య ఆలయంలో కొబ్బరికాయ కొట్టేందుకు తన పిల్లలతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన కొందరు అర్జునయ్యను అడ్డుకున్నారు. అర్జునయ్య వెంటనే స్పందించి వారిని ఎందుకు లోపలికి వెళ్లకూడదని నిలదీశాడు.

దీంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని మర్నాడు గ్రామంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీలో గ్రామస్తులు నరేందర్ రెడ్డి, బర్ల కృష్ణ, శ్రీకాంత్, సర్సింహారెడ్డి, వై.రాజు, రాఘవేందర్‌రెడ్డి, యు.రాజు, అరవింద్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అఖిలేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, అనంతరెడ్డి, మల్లారెడ్డి  కూడబలుక్కుని అర్జనయ్యను కులం పేరుతో దూషించారు. అర్జునయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. దీంతో బాధితులు సోమవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ప్రజాసంఘాల నిరసన..

అర్జునయ్యను ఆలయంలోకి రాకుండా కొందరు అడ్డుకున్నారని తెలుసుకున్న పలు ప్రజాసంఘాలు, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల కు చెందిన నేతలు రామకృష్ణ, ప్రవీణ్, అ ర్జున్, కృష్ణ, సత్యానందం, భీమయ్య, బాల్ లింగం, యాదయ్య మంగళవారం చే వెళ్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

అర్జునయ్యకు న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. అల్లవాడలో రెండేళ్ల నుంచి ఎస్సీలపై ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారని, గత ఏడాది కూడా ఎస్సీలను బతుకమ్మ సంబురాల్లోకి రానీయలేదని గుర్తుచేశారు.  నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే తాము పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.