22-03-2025 01:38:39 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, మార్చి 21: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్రోణి ప్రభావంతో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. దీంతో చేతికందొచ్చిన పంటలు నీటిపాలయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. కరీంనగర్, చొప్పదండి, గంగాధర, రామడుగు, మానకొండూ రు, వీణవంకతో పాటు పలు మండలాల పరిధిలోని గ్రామాల్లో వర్షం పడింది.
హైదరా బాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాల్లో వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చొప్పదండిలోని జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం వర్షం నీటికి కొట్టుకుపోయింది. ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పొట్ట దశలో ఉండగా, మరికొన్ని చోట్ల కోతకు వచ్చింది.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు మల్యాల, కొండగట్టు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకొని కొద్దిపాటి వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లాలో వడగండ్ల వానతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రామగుండం, పెద్దపల్లి, బసంత్‌నగర్, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ తదితర మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది.
ఉన్నట్టుండి ఒక్కసారి ఈదురుగాలులతో వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడిలో వడగండ్లు పడ్డాయి. సుమారు పది నిమిషాల పాటు వడగండ్లు పడటంతో కోతకు వచ్చిన ధాన్యం కళ్ల ముందే రాలిపోయిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
లింగంపల్లి గ్రామంలో పిడుగు పడి గాలెం నారాయణ, చాకలి సాయిలుకు చెందిన రెండు పాడి గేదెలు మృతి చెందాయి. కోమటిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం రాజయ్యకు చెందిన మూడు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దోమకొండ మండలంలోని ముత్యంపేట్, బీబీపేట్ మండలాల్లో అకాల వర్షంతో చెట్లు విరిగిపడిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో మెదక్ జాతీయ రహదారి కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి వద్ద రహదారిపై ఉన్న సూచిక బోర్డులు విరిగిపో యాయి. పలు దుకాణాలపై ఉన్న రేకులు గాలికి కొట్టుకుపోయాయి.
దీంతో అక్కడే పార్కింగ్ చేసిన కారు, బైక్‌పై రేకులు పడడంతో ధ్వంసమయ్యాయి. అలాగే చిన్నఘణపూర్ రహదారిపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులను కొల్చారం మీదుగా మళ్లించారు. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
మెదక్, పాపన్నపేట మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి. పెద్దశంకరంపేట మండలంలో వర్షం వల్ల పలు కాలనీల్లోని రహదారులు నీటితో నిండిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కారణంగా కోత దశకు చేరుకున్న వరి, మొక్కజొన్న పంటలతో పాటు పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.
ఆదిలాబాద్‌లో అత్యధికం..
ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో ఈదురు గాలులు, వడగళ్ల వానలు పడినట్లు చెప్పింది. ఆదిలాబాద్‌లోని ముధోల్‌లో అత్యధికంగా 18.1 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైనట్లు వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో 11.4మిల్లీమీటర్లు, రాజనాలలో 10.2మిల్లీమీటర్లు, బాలకొండలో 6.4మిల్లీ మీటర్లు నమోదైంది.
నేడు ఆరెంజ్ అలర్ట్ చేసిన ప్రాంతాలు
మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది.
అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్‌రెడ్డి
ఈదురు గాలులు, వడగండ్ల వానలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. శనివారం కూడా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే సంబంధిత ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రానున్న 48 గంటల్లో భారీగా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అకాల వర్షాల వల్ల ఏర్పడే నష్టాల అంచనాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించాలన్నారు.