calender_icon.png 22 October, 2024 | 2:00 PM

అకాల వర్షం.. అపార నష్టం

22-10-2024 12:59:33 AM

  1. పలు జిల్లాల్లో జోరువాన 
  2. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, అక్టోబర్ 21: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, మెదక్, హనుమకొండ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన వరిపంట నేలకొరిగింది.

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండ లం ధర్మరావుపేటకు చెందిన రైతు ఏనుగు గౌతంరెడ్డికి చెందిన 40 క్వింటాళ్లు, గడ్డం లక్ష్మారెడ్డికి చెందిన 25 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని గాంధీ గంజ్‌లో వ్యవసాయ ఉత్ప త్తులు విక్రయించుకునేందుకు వచ్చిన రైతు లు, వార సంతలో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.

అక స్మాత్తుగా కురిసిన వాన హనుమకొండ నగరాన్ని అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో నగరం జలమయమైంది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువు లను తలపించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూ రి ప్రకాశ్‌రెడ్డి ఇల్లు సైతం వరద నీటిలో చిక్కుకుంది.

ఇందిరా నగర్, తిరుమల బార్, పోచ మ్మ గుడి ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లాలో అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో ధాన్యం నీటిపాలైంది. మెదక్ మండలం ఔరంగాబాద్ గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతుల ధాన్యం తడిసి ముద్దయింది.

వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి, చెర్లపల్లి, మాసాయిపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. సుమా రు 300 క్వింటాళ్ల వరి ధాన్యం నీటిపాలైంది. పెద్దపల్లి జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.