calender_icon.png 1 November, 2024 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మబోతే అడవే!

16-05-2024 02:04:46 AM

రాష్ట్రవ్యాప్తంగా వరి పైరును దెబ్బతీసిన అకాల వర్షం

కల్లాల్లోని ధాన్యపు రాశుల్లోకి చేరిన వర్షపు నీరు

ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు చుక్కెదురు

నాణ్యతా ప్రమాణాల పేరుతో నిర్వాహకుల కొర్రీలు

సాకులు చెప్పి తూకాల్లో బస్తాకు కిలో చొప్పున కోత 

ప్రభుత్వ మద్దతు ధరకు మంగళం.. 

పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు

విజయకాంత్రి నెట్‌వర్క్, మే 15 : రాష్ట్రప్రభుత్వం యాసంగికి క్వింటా గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2,203, గ్రేడ్ ధాన్యానికి రూ.2,183  మద్దతు ధర ప్రకటించింది. ఈ మేరకు డీఆర్డీడీఏ ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులు వేలాది రూపాయలు వెచ్చించి కోతలు కోయించి, రవాణా చార్జీలు చెల్లించి, అనేక ప్రయాసల కోర్చి కేంద్రాలకు తీసుకెళితే అక్కడ వారికి చుక్కెదురవుతున్నది. కేంద్రాల ఆవరణలో నిర్వాహ కులు ప్యాడీ క్లీనింగ్ చేయించకపోవడంతో అక్కడ ఆరబోసిన ధాన్యంలోకి తేమ చేరుతున్నది. దీంతో మిల్లర్లు తేమ, తాలు సాకు చూపి ఒక్కో బస్తాపై అదనంగా కిలో తరుగు తీస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. దళారులు లేనిపోని సాకులు చూపి తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యం కొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అయితే పెట్టుబడులు సైతం చేతికి రావని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీపై పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల్లో కొనుగోళ్లు స్లో.. స్లో

1. నాగర్‌కర్నూల్ జిల్లాలో 94 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 79 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో నిర్వాహకులు ఇప్పటివరకు కేవలం 15,528 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 102 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, 50 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో నిర్వాహకులు 5,195 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మెప్మా ఆధ్వర్యంలో రెండు సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇలా.. 1.10 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్వాహకులు కేవలం 21,221 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. 

2. మంచిర్యాల జిల్లాలో అధికారులు  1.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా నిర్వాహ కులు 78 వేల మెట్రిక్ టన్నులు మాత్ర మే సేకరించారు. మొత్తం 11,523 మంది రైతుల నుంచి రూ.172 కోట్ల విలువైన ధాన్యం సేకరించారు.  కానీ ఇప్పటివరకు 4,835 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే రూ.70 కోట్లు జమ చేశారు. రైతుల ఖాతాల్లో ఇంకా రూ.100 కోట్లు జమ కావాల్సి ఉన్నది.

3. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 98, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 87, ఎంఈపీఎంఏ  ఆధ్వర్యంలో ఒకటి, డీసీఎంఎస్ నాలుగు.. ఇలా జిల్లావ్యాప్తంగా 190 ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఆయా కేంద్రాల్లో కేవలం 709 మంది రైతులు మాత్రమే 4,454.720 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు.

4. వరంగల్ జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 208 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అధికారులు వీటి ద్వారా 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు.

5. జనగామ జిల్లాలో అధికారులు 1.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 80శాతాన్ని లక్ష్యాన్ని సాధించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇప్పటివరకు 15,935 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి, వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.170.81 సొమ్ము జమ చేశారు.

6. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 259 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాగా అధికారులు 1.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 40శాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకున్నారు. 17,499 మంది రైతుల నుంచి రూ.315 కోట్ల విలువైన ధాన్యం సేకరించారు.

7. కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లాలో ఇప్పటివరకు 16 సెంటర్లలో 90 శాతం ధాన్యం కొనుగోలు సేకరణ ప్రక్రియ పూర్తయింది. కేంద్రాల నుంచి ఇప్పటివరకు 1,271 టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది.

8. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివవరకు 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో నిర్వాహకులు  9,618 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

9. పెద్దపల్లి జిల్లాలో అధికారులు 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మరో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉన్నది.