calender_icon.png 22 April, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం.. ఆగమాగం

22-04-2025 02:09:33 AM

- చేతికొచ్చిన వరి పంట నేలపాలు 

-  నేలరాలిన మామిడి 

-పంట నష్టం వివరాల ను అంచనా వేస్తున్న అధికారులు 

 రంగారెడ్డి ఏప్రిల్ 21 (విజయ క్రాంతి ): గత వారం రోజులుగా రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టం చేసింది. చేతికొచ్చిన వరి పంటతో పాటు మామిడి బొప్పాయి ఆకుకూరలు నేలపాలయ్యాయి. కళ్ళముందే తమ పొలా ల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతన్నలు పంటలను చూసి కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు.

వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా రు. వానకాలం సీజన్లో సరిపడా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టం తగ్గింది. వానాకాలం సాగు అంతంత మాత్ర మే కాగా.... యాసంగి సాగు పైన రైతులు కొద్దో గొప్ప ఆశలు పెట్టుకున్నారు. బోరుబావిలో నీళ్లు ఉన్న రైతులు అష్ట కష్టాలు పడి పంటలను సాగు చేశారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి.

పంటలు మంచి దిగుబడి వచ్చి నాలుగు రూపాయలు చేతికి అందుతాయని కొందరు రైతులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మరికొంతమంది రైతులు సాగు కోసం తీసుకువచ్చిన అప్పులు తీర్చొచ్చని.... తమ ఇళ్లల్లో శుభకార్యాలు చేసుకోవచ్చని గంపెడు ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలపై అకాల వర్షం నీళ్ళు పోసినట్లయింది. ప్రస్తు తం అకాల వర్షాలు రైతులకు కంటిమీద కు నుకు పట్టనిస్తాలేవు. అకాల వర్షం తోడు వడగల్లు గాలివానతో చేవెళ్ల, షాద్నగర్,ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, ఇబ్రహీం పట్నం, మంచాల,ఆదిభట్ల,అబ్దుల్లాపూర్మెట్ కందుకూరు,మహేశ్వరం నియోజకవర్గాల్లో మెజార్టీగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వరి పంట తో పాటు మామిడి, బొప్పాయి, ఆకుకూరలు, పళ్ళతోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇప్పటికే జిల్లాలో ఆయా మండలాల్లో దెబ్బతిన్న పంటల నష్ట వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు తిరిగి పంట నష్టం అంచనా వేస్తున్నారు.అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో సుమారుగా 400 ఎకరాలకు పైగానే పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథ మికంగా గుర్తించినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

 ఆశలు...ఆవిరి.....

 యాసంగి పంటల పైన ఎంతో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. అకాల వర్షాలకు  తలకొండపల్లి, మాడుగుల, షాద్నగర్, కేశంపేట్, కొందుర్గు, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మహేశ్వరం లో మెజార్టీగా వరి పంట, మామిడి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ఒక అంచనాకొచ్చారు. సీజన్లో వచ్చే మామిడి తోటలను లక్షల రూపాయలు పెట్టి లీజుకు తీసుకున్నారు. మంచి దిగుబడి వస్తే .... పెట్టిన పెట్టుబడి పోను  నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి ఎంతో ఆశ పెట్టుకున్నారు.

అకాల వర్షం గాలివానకు .... ఆ మామిడి తోటల్లో  మెజార్టీగా మామిడికాయలు నేలరాలి... నేల రాలిన మామిడికాయలను చూసి రైతులు లబోదిబో అంటున్నారు. పెట్టిన పెట్టుబడి దేవుడెరుగు.... ప్రస్తుతం అప్పులపాలయ్యామని.... తమకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. మే నెలలో పూర్తిస్థాయిలో మామిడి చేతికి వస్తుందని... మార్కెట్కు తరలించవచ్చు అనే రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు.

 అకాల వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న పం టలను క్షేత్రస్థాయిలో  వివరాలు సేకరిస్తున్నాము. మెజార్టీగా వరి, జొన్న, మామిడి, పళ్ళ తోటలు దెబ్బతిన్నట్లు తమ దృష్టికి వ చ్చింది. పూర్తిస్థాయిలో పంట నష్ట వివరాలను తెప్పించుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం.