16-11-2024 12:00:00 AM
ద్వీపదేశం శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్‌పీపీ) ఘనవిజయం సాధించింది. 225 స్థానాలున్న లంక పార్లమెంటుకు గురువారం ఎన్నికలు జరగ్గా మొత్తం స్థానాల్లో ఎన్‌పీపీ కూట మి 159 స్థానాలు దక్కించుకుని మూడింట రెండువంతుల మెజారిటీ సాధించింది. 2022లో ఆర్థిక సంక్షోభం మొదలైన తర్వాత శ్రీలంకలో ఇదే తొలి పార్లమెంటు ఎన్నిక.
గత సెప్టెంబర్ 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిస్సనాయకె 50 శాతం ఓట్లు సాధించలేక రెండో దఫా లెక్కింపులో గెలుపొందారు. దీంతో ఆయనకు పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారాయి. దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు సాధారణ మెజారిటీ అయిన 113 సీట్లయినా సాధించేందుకు ప్రయత్నిస్తానని దిస్సనాయకె చేసిన ప్రచారం ఎన్‌పీపీకి ఎంతో దోహదపడింది.
కాగా గత అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమ్‌సింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే శ్రీలంక రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన రాజపక్స సోదరులు కూడా బరిలో లేకపోవడం కూడా దిస్సనాయకెకు కలిసివచ్చింది. ఈ ఘన విజయంతో ఆయన ఇకపై తన విధానాలను ఎలాంటి అడ్డంకీ లేకుండా అమలు చేయడానికి వీలవుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 1.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అయితే మొత్తం 225 స్థానాల్లో 196 స్థానాలకు మాత్రమే ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఓటర్లు ఎన్నుకున్నారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యతలను కేటాయించవచ్చు. నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలిచే మిగతా 29 స్థ్థానాలను పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూపులకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. 2022లో రాజపక్సె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీమారక నిల్వలు అడుగంటి నిత్యావసర వస్తువుల దిగుమతు లకు ఇబ్బందిగా మారడంతో శ్రీలంకలో ధరలు విపరీతంగా పెరిగాయి.
ఫలితంగా ప్రజలు తిరుగుబాటు చేయడంతో రాజపక్సె పారిపోవలసి వచ్చింది. తర్వాత వచ్చిన రణిల్ విక్రమ్ సింఘె ప్రభుత్వం తీసుకున్న చర్య ల ఫలితంగా ఈ ఏడాది జులై నాటికి ఆ నిల్వలు 5.58 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు ఆ ప్రభుత్వం భారత్, చైనా, జపాన్ లాంటి సన్ని హిత దేశాలతో జరిపిన చర్చల ఫలితంగా సుమారు 10 బిలియన్ డాలర్ల మేరకు రుణాల చెల్లింపు కాలపరిధులు, వడ్డీరేట్లు తగ్గింపు వంటి వెసులుబాట్లు లభించాయి.
దీంతో ఐఎంఎఫ్ వంటి సంస్థలనుంచి ఉద్దీపన ప్యాకే జీలు లభించడంతో ఇప్పుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటబడింది. అయినప్పటికీ ఆరుశాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా ఆహార వస్తువులు, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగిరాలేదు.
మార్క్సిస్టు లెనినిస్టు భావజాలంతో నడిచే జనతా విముక్తి పెరుమన పార్టీనుంచి వచ్చిన దిస్సనాయకె ముందు అనేక పెనుసవాళ్లు ఉన్నాయి. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్రరేఖ దిగువకు పడిపోయారు. వ్యాపారస్థులు, పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీరేట్లు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డంతో వాటిలో పనిచేసే మహిళలు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులుగా మారారు.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో ఈ రంగాలే కీలకం. ఇప్పుడు ఈ వర్గాలకు ఉపాధి కల్పించడం దిస్సనాయకె ముందున్న పెద్ద సమస్య. మరోవైపు కుదేలయిన పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న దిస్సనాయకె పార్టీలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమన్న విషయాన్ని దిస్సనాయకె సైతం గ్రహించారని అంటున్నారు.
పార్లమెంటులో తిరుగులేని ఆధిక్యత సాధించిన నేపథ్యంలో ఈ సవాళ్లన్నిటినీ అధిగమించే విధానాలతో ముందుకు సాగడం ఆయనకు అత్యంత అవసరం.