calender_icon.png 8 October, 2024 | 3:57 AM

హైడ్రాబాద్ బిల్డర్లలో అలజడి

01-09-2024 12:48:37 AM

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా హైడ్రా మీదనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న శిఖం భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే హైడ్రా కూల్చి వేస్తున్నది. దీంతో అక్రమార్కులు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాము కట్టిన నిర్మాణాలను ఎప్పుడు కూల్చివేస్తుందోనని భయపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు జరుగుతుండడంతో కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నా.. ధనవంతులను వదిలేసి కేవలం పేదల ఇండ్లను కూల్చివేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా ఇన్నాళ్లకైనా కబ్జాదారుల చెర నుంచి భాగ్యనగరానికి హైడ్రా విముక్తి కలిగిస్తుందని పలువురు భావిస్తున్నారు. 

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో...

నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో గుబులు

హైడ్రా కమిషనర్‌తో బిల్డర్లు భేటీ 

బిల్డర్ల డిమాండ్లపై కమిషనర్‌కు నరెడ్కో వినతి

ప్రశ్నార్థకంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఉనికి

నగరమంతటా హైడ్రాపై చర్చ

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 31 (విజయక్రాంతి): హైదరాబాద్ బిల్డర్లలో హైడ్రా అలజడి షురూ అయ్యింది. ఏ చౌరస్తాలో నిలబడినా హైడ్రాపైనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) దండెత్తుతోంది. 

భవనాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  కఠినంగా వ్యవహరిస్తూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు. ఆక్రమణల పై ప్రజల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. మొదటి విడతలో ఆక్రమణలను అడ్డుకోవడం, రెండో విడతలో వాటిపై చర్యలు తీసుకోవడం, అనుమతుల నిరాకరించడంపై హైడ్రా దృష్టి సారించింది.

అయితే  అనుమతి పొంది రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న ప్రజలకు కూడా తాజాగా హైడ్రా నోటీసులు ఇస్తుండటం, అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుండటంతో  బిల్డర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  లక్షలు, కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన భవనాలకు కూడా నోటీసులు జారీ అవుతుండటంతో తమ డబ్బులు తమకు ఇవ్వాలని బిల్డర్లను ప్రజలు నిలదీస్తున్నారు. అలాగే హైడ్రా ఏర్పాటు తరువాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

నిబంధనలున్నా.. అమలు సున్నా..

భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ అనుమతి ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది.  హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు ఫీజు, స్థలం ఫోటో, పహాణీ, సేల్ డీడ్ కాపీ, లింక్ డాక్యుమెంట్ కాపీ, లే-అవుట్ కాపీ, స్థలం తాజా మార్కెట్ విలువకు సంబంధించిన పత్రం, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్  (ఈసీ) తప్పనిసరి. అంతేకాదు ల్యాండ్ యూసేజ్ సర్టిఫికెట్, ఎల్‌ఆర్‌ఎస్ సర్టిఫికెట్, గూగుల్ లొకేషన్ పింగ్, గుర్తింపు పత్రం, 100 రూపాయల స్టాంప్ పేపర్‌పై ఆఫిడవిట్, 20 రూపాయల విలువ కలిగిన స్టాంప్ పేపర్ పై డిక్లరేషన్ వంటి సవాలక్ష ఫార్మాలిటీస్, డాక్యుమెంట్స్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

అలాగే లొకేషన్ ప్లాన్, కాంటూర్ ప్లాన్, సైట్ ప్లాన్‌తో పాటు భవనంలోని ప్రతి అంతస్థుకు సంబంధించిన సమగ్రమైన డ్రాయింగ్స్ ఉండాలి. అలాగే పార్కింగ్ ఫ్లోర్స్, టెర్రస్, బిల్డింగ్ ఎలివేషన్, క్రాస్ సెక్షన్, ల్యాంగిట్యూడనల్ సెక్షన్, రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ పిట్, యజమాని, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ల సంతకాలతో కూడిన మార్టిగేజ్ ప్లాన్ కూడా ఉండాలి. నిర్మాణ స్థలానికి చేరటానికి ప్రస్తుతం ఉన్న దారి వివరాలు కూడా ప్లానులో పొందుపరచాలి.

స్థలం హద్దుల కొలతలు, ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న భవనాల వివరాలు, భవన నిర్మాణ స్థలానికి ఇరుగు, పొరుగున ఉన్న వీధుల వివరాలు అన్నీ ప్లాన్‌లో క్లియర్‌గా సమర్పించాలి.  స్థల స్వభావం, చుట్టు పక్కల చెరువులు ఉంటే  ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేదని నిర్ధారించే పత్రం సమర్పించాలి.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల అలసత్వం కారణంగా నిబంధనలు అమలు కావడం లేదు. 

రుణాలున్నా ఆగని కూల్చివేతలు..

ఇక ఇంటికి అన్ని అనుమతులు సక్రమంగా ఉంటేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.  లోన్ మంజూరు సమయంలో బ్యాంకులు సైతం అన్ని డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తాయి. అయితే ప్రస్తుతం  జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు ఉండటంతో పాటు కలెక్టర్ల నుంచి ఎన్‌ఓసీలతో పాటు బ్యాంకు రుణాలున్న అనేక భవనాలను కూడా ఇటీవల మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హైడ్రా కూల్చివేసింది. వాటిపై ఉన్న రుణాలను ఎలా తీర్చాలని  బాధితులు వాపోతున్నారు. దీంతో తమ సంగతేమేటని  బిల్డర్ల వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీ, -హెచ్‌ఎండీఏ ఉనికి ప్రశ్నార్థకమేనా?

చట్టపరంగా అన్ని అనుమతులు పొంది ఇళ్లు కట్టుకున్నాక, ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరు చెప్పి హఠాత్తుగా హైడ్రా ఇళ్లను కూల్చుతుండటంపై హైదరాబాద్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముదుగా ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులపై చర్యలు తీసుకున్న తర్వాతనే తమ ఇండ్లను కూల్చాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. హైడ్రా నుంచి నోటీసులు అందుకున్న వారు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను సంప్రదిస్తే తమకు సమాధానం చెప్పడం లేదని బాధితులు వాపోతున్నారు.

ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, హైడ్రా అధికారాలు, పరిధిపై స్పష్టత కోరేందుకు జీహెఎంసీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. ఏదేమైనా హైడ్రా జెట్ స్పీడ్‌పై సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తప్పుడు మార్గాల్లో  అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి గాని.. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇంటిని కూల్చడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగనాథ్‌కు బిల్డర్ల వినతి...

చెరువుల పరిరక్షణ కోసం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో ఖంగుతిన్న కొందరు బిల్డర్లు ప్రముఖ డెవలపర్ల సంఘం నరెడ్కో ఆధ్వర్యంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వినతిపత్రం అందించారు.  ప్రధానంగా చెరువుల్లోని పట్టా భూములు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉంటే 200 శాతం టీడీఆర్ వర్తింపజేస్తున్నారని, ఈ నిబంధనలను సవరించాలని నరెడ్కో కోరింది.

జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రతి చదరపు అడుగు విస్తీర్ణంలో 50 అడుగుల నిర్మాణాలు చేస్తున్నారని, కానీ బిల్డర్లు మాత్రం కేవలం 23 అడుగులు మాత్రమే నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని, తమ సమస్యను పరిష్కరిస్తే అక్రమ నిర్మాణాలు కొంత వరకు తగ్గుతాయని తెలిపారు. వీటిపై సానుకూలంగా స్పందించిన రంగనాథ్ బిల్డర్లు నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బడాబాబుల వెన్నులో వణుకు..

 నగరంలో చాలా వరకు చెరువులు, కుంటలను బడా బిల్డర్లు, రాజకీయ నాయకులు ఆక్రమించి మేడలను నిర్మించారు.  ఇలాంటి జాబితాలో ఉన్న నిర్మాణాలలో హైడ్రా కేవలం ఎన్ కన్వెన్షన్‌ను మాత్రమే కూల్చింది. కానీ మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఓవైసీ బ్రదర్స్ నిర్మాణాల జోలికి వెళ్లలేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు పెట్టినా అటువైపు హైడ్రా వెళ్ల లేదు. అలాగే చెరువులను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేసిన బడా రియల్ ఎస్టేట్ కంపెనీల వైపు హైడ్రా కన్నెత్తి చూడడం లేదు. వీరిపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా ఎందుకు జాప్యం చేస్తోందని ప్రతిపక్ష  నాయకులు, బాధితులు ప్రశ్నిస్తున్నారు.