- తమవారి కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపు
- గ్రామంలో ఇండ్లకు వేసిన తాళాలు వేసినట్లే
- నిర్మానుష్యంగా ఫార్మా గ్రామాలు
వికారాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): లగచర్ల ఘటన జరిగిన 6 రోజులు కావొస్తున్నా ఫార్మా బాధిత తండాలు ఇంకా తేరుకోలేదు. రాత్రయితే చాలు పోలీసుల జీపు సైరన్లు, వీధుల్లో బూట్ల చప్పుళ్లు గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారులపై అనూహ్యంగా జరిగిన దాడి ఘటనలో జైలుకు వెళ్లిన తమవారు ఎప్పుడొస్తరని బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
అధికారులపై దాడికి కేంద్రంగా మారిన లగచర్లలో ఇంకా జనాలు లేక నిర్మానుష్యంగానే కనిపిస్తుంది. రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో ఆరురోజుల క్రితం ఇండ్లకు వేసిన తాళాలు ఇంకా తియ్యలేదు. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారోనని భయపడుతు న్నారు. మంగళవారం రాత్రి గ్రామంలోకి వచ్చి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
అదే రాత్రి నుంచి కనిపించకుండా పోయిన కొందరు పోలీసుల అదుపులో ఉన్నారని వారి కుటుంబీకులు భావిస్తున్నారు. కానీ దాడిలో పాల్గొన్న చాలా మంది పరారీలో ఉన్నట్లు ఓ వైపు పోలీసులు చెబుతుండటం తండా వాసులను అయోమయానికి గురిచేస్తోంది. ఇంతకి తమ వారు పోలీసుల అదుపులో ఉన్నారా? లేకా పరారీలో ఉన్నారా? అనే విషయం తేల్చుకోలేకపోతున్నారు.
నాన్న ఎప్పుడొస్తడు?
బాధిత తండాల్లోని కొన్ని కుటుంబాల మహిళలు, వారి చిన్న పిల్లలతో పగటిపూట ఒకేచోట చేరి జైల్లో ఉన్న తమవారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. తమ బతుకుకు ఆధారమైన భూమి పోతున్న విషయం తెలియని, అధికారులపై దాడి అంటే అర్థం కాని చిన్నారులు నాన్న ఎప్పుడొస్తడంటూ అడగటం బాధిత మహిళలను తీవ్ర దు:ఖానికి గురిచేస్తోంది. మరోవైపు తమ భూముల సంగతేందన్న ఆలోచన వారిని కలిచివేస్తోంది. అధికారులపై దాడి చేసినందుకు మరింత కోపం పెంచుకొని బలవంతంగా భూములు తీసుకుంటరేమోనని మదనపడుతున్నారు.
ఖాళీగా దర్శనమిస్తున్న గ్రామాలు
దాడితో సంబంధం లేని అనేక కుటుంబాలు అదేరోజు రాత్రి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. వారం రోజులవుతున్నా తిరిగి వచ్చేందుకు భయపడుతున్నారు. ఇంటికెళ్తే పోలీసులు అరెస్టు చేస్తరేమోననే సందేహంతో బంధువుల వద్ద, పొలాల వద్ద గడుపుతున్నట్లు మిగతా గ్రామస్తులు చెబుతున్నారు. వరికోతలు చేయాల్సిన సమయంలో ఊరి విడిచి వెళ్లాల్సి వచ్చిందని మహిళలు వాపోతున్నారు.
కలెక్టర్‌కు అదనపు భద్రత
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ప్రభుత్వం అదనపు సెక్యూరిటీ కల్పించింది. లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్‌కు ఇద్దరు ఏఆర్ గన్‌మెన్‌లను పోలీసు శాఖ తరఫున కేటాయించారు. అదనపు డీజీపీ కలెక్టర్‌తో సమావేశమైన కొద్ది సేపటికే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
పత్తాలేని సురేశ్?
లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న బోగమోని సురేశ్ ఎక్కడ ఉన్నాడనే చర్చ జోరుగా సాగుతోంది. దాడి జరిగి 6 రోజులు గడుస్తున్నా సురేశ్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అధికారులపై దాడి జరిగిన మరుక్షణమే సెల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీంతో సురేశ్‌ను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
లగచర్లలోని అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని గ్రామంలోని కొందరు బాధితులు సైతం ప్రశ్నిస్తుండటంతో పోలీసులకు సురేశ్ అరెస్టు సవాల్‌గా మారింది. సురేశ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, లేదా కర్ణాటకలోని తన బంధువుల వద్ద ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సురేశ్‌కు ముంబైలోనూ బంధువులు ఉన్నారని, వారి వద్దకు వెళ్లే అవకాశమూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ పోలీస్ బృందం సురేశ్ ఆచూకీ కోసం ముంబై వెళ్లినట్లు సమాచారం. శనివారం మరో 8 మందిని అరెస్టు చేయడం, అదే రోజు అడిషనల్ డీజీపీ వికారాబాద్‌కు రావడంతో సురేశ్ అరెస్టయి ఉండొచ్చని కొందరు భావించారు. అదనపు డీజీపీ ఈ విషయాన్ని నిర్ధారించలేదు.
దాడిపై విచారణ సాగుతోంది
- అడిషనల్ డీజీపీ మోహన్ భగవత్
- మరో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
లగచర్ల దాడి ఘటన విచారణలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. కలెక్టర్ స్థాయి అధికారులపై దాడి జరగడంతో ఈ కేసును అదనపు డీజీపీ మోహన్ భగవత్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో రెండు గంటల పాటు సమావేశమయ్యా రు.
దాడికి ముందు, దాడి జరుగుతున్న సమయంలో బోగమోని సురేశ్ పాత్ర, వ్యవహార శైలిపై అడిషనల్ డీజీపీ కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ శిబిరం నుంచి గ్రామంలోకి వెళ్లే ముందు పోలీసులను ఎందుకు తీసుకెళ్లలేక పోయారని, మీరే వద్దన్నారా, లేక పోలీసులే రాలేదా అని ఆరా తీసినట్లు సమాచారం.
అనంతరం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన అదనపు డీజపీ గంటపాటు లగచర్ల సంఘటనపై చర్చించారు. ఇప్పటి వరకు అరెస్టయిన వారి జాబితాను పరిశీలించినట్లు తెలిసింది. దాడిలో పాల్గొన్న ప్రతిఒక్కరిని మరో రెండు రోజుల్లో పట్టుకోవాలని, అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. కాగా శనివారం మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కొడంగల్ పీఎస్‌కు తరలించారు.