calender_icon.png 26 January, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మకమివ్వని అమ్మకం

25-01-2025 12:42:33 AM

 కొలతల్లో మాయాజాలం దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో మోసం నిలువుదోపిడీకి గురవుతున్న వినియోగదారులు తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు

సూర్యాపేట, జనవరి 24 (విజయ క్రాంతి):  ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేసే వారు మెజీషియన్లయితే.. చాలామంది వ్యాపారులు వారినే మించిపోతున్నారు. తూకంలో మాయా జాలంతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇంద్రజాలంలో సిద్ధహస్తులు ఉన్నదాన్ని లేనట్టు చేస్తే.. వీరు మాత్రం లేని బరువును ఉన్నట్టు చూపించి జనానికి టోకరా వేస్తున్నారు. తూనికలు కొలతల్లో బురిడీతో వినియోగదారులు రోజూ అడుగడుగునా మోసపోతున్నరు.

ఉదాహరణకు కొన్ని 

సూర్యాపేట పట్టణంలోని ఓ చికెన్ దుకాణంలో మల్లేష్ అనే ఉద్యోగి ఇటీవల కిలో చికెన్ కొన్నారు. బరువు తగ్గినట్టు అనుమానం రావడంతో మరో దుకాణంలో తూకం వేయిస్తే 900 గ్రాములే ఉంది. పట్టణానికి  చెందిన శ్యామల గత రెండు రోజుల క్రితం ఓ చిల్లర దుకాణంలో రెండు కిలోల కందిపప్పు కొనుగోలు చేశారు.

ఎలక్ట్రానిక్ కాటా తూకమే అయినా మోసం జరిగినట్టు అనుమానం వచ్చి మరో దుకాణంలో కందిపప్పును తూకం వేయించారు. 1900 గ్రాములు మాత్రమే ఉంది..100 గ్రాములు తగ్గడంతో వ్యాపారితో తగాదాకు దిగారు. వీటిని అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లదీస్తున్నారు.

మనలో ప్రతి ఒక్కరికీ ఇలాటి అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయితే తెలియక కొంత, తెలిసినా అడిగే తీరిక లేక కొంత.. ఉదాసీనత వల్ల కొంత.. మొత్తం మీద చాలా సందర్భాల్లో ఈ మోసాలు మరుగున పడిపోతూనే ఉంటాయి. దీంతో పలువురు వ్యాపారులు ఇదో ఆనవాయితీగా మోసం చేస్తున్నారు.

గతంలో పలు ఆరోపణలు 

పెట్రోల్ బంకుల పంపుల్లో తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణలోనే కొల తలు నిర్ధారించాలి. చాలా చోట్ల వీరు వెళ్లకుండానే బంకు యజమానులు ఇష్టాను సారం ఖరారు చేస్తున్నారు. లీటరు పెట్రోల్, డీజిల్ వేయడానికి కొలతలు నమోదు చేసేటప్పుడు 50 నుంచి 100 మి.లీ. తక్కువ పడేలా నమోదు చేస్తున్నట్టు బంకుల్లో పని చేసే సిబ్బందే చెబుతున్నారు. 

గ్రామాలలో పత్తి, వరి ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు వాడుతున్న కాంటాల్లో మోసాలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి. అదే విదంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాంటాల తూకంలో తేడాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 

పర్యవేక్షణ కరువు 

 జిల్లాలో తూనికలు, కొలతల పరికరాలు అమ్మడానికి కేటగిరి 1 కింద సూర్యాపేటలో మూడు దుకాణాలకు అనుమతి ఉండగా, కేటగిరి 2లో  సూర్యాపే నందు  ఒక దుకా ణం, కోదాడలో ఒక దుకాణం అనుమతు పొందింది. ఇక  తూనికలు పరికరాలకు స్టాంపింగ్ వేయుటకు సూర్యాపేటలో 4గురు కోదాడలో ఇద్దరు అనుమతి పొంది ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 90 వేలు ఉన్నాయి. రెండేళ్లకోసారి కాటాలు, తూకం రాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఈ పరిస్థితే ఉండడం లేదు.  దీంతో వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారు.