- అవామీ లీగ్, మైనారిటీలే టార్గెట్
- గత 72 గంటల్లో 300 మంది హత్య
- ఇండ్లు, వ్యాపారాలు, ఆస్తుల లూటీ
- ఎంపికచేసుకొని దాడులు చేస్తున్న ముఠాలు
- హిందువులపై మరిన్ని దాడులు జరుగొచ్చు
- అమెరికా మీడియా హెచ్చరిక
- వీసాల జారీ కేంద్రాలను మూసేసి భారత్
ఢాకా, ఆగస్టు 8: సంక్షుభిత బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదులు, అల్లరిమూకలు, రాజకీయ ప్రత్యర్థులు ఏకమైన మైనారిటీలు, మొన్నటివరకు అధికారంలో ఉన్న అవామీ లీగ్ కార్యకర్తలు, నేతలపై తీవ్ర హింసకు పాల్పడుతున్నారు. పౌర తిరుగుబాటుకు భయపడి దేశం విడిచి ప్రధాని షేక్ హసీనా పారిపోయిన తర్వాత కూడా హింస ఆగటం లేదు. దేశంలో ప్రభుత్వం లేకపోవటంతో అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. సందులో సడేమియా అన్నట్టుగా మత ఛాందస జమాతేతోపాటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యకర్తలు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ హతమారుస్తున్నాయి. పట్టణాలతోపాటు పల్లెల్లోనూ హత్యాకాండ కొనసాగుతున్నది. హిందువులు, అవామీ లీగ్ సభ్యుల ఇండ్లు, వ్యాపారాలు, ఆస్తులను లూటీ చేసి తగులబెడుతున్నారు.
560 మంది హత్య
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి గురువారం వరకు 560 మందికిపైగా హత్యకు గురయ్యారు. గత 72 గంటల్లోనే 250 మందికిపైగా హతమయ్యారు. అనధికారికంగా ఈ లెక్క రెట్టింపు ఉండొచ్చని చెప్తున్నారు. వీరిలో అత్యధికులు మైనారిటీలు, అవామీ లీగ్ కార్యకర్తలే ఉన్నారు. అల్లరిమూకలు కొందని ఎంపిక చేసుకొని మరీ హత్యలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం మొత్తం సైన్యం పహారాలో ఉన్నా మైనారిటీలపై యథేచ్చగా దాడులు కొనసాగుతున్నాయి.
సరిహద్దుకు వేలమంది
హింస నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, అవామీలీగ్ కార్యకర్తలు కుటుంబాలతో సహా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలకు వేలమంది తరలి వస్తున్నారని భారతీయ అధికారులు తెలిపారు. వీరిని సహరిద్దు భద్రతాదళం అక్కడే ఆపేస్తున్నది. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి సరిహద్దుకు వందలమంది చేరుకొన్నట్టు సమాచారం. వీరిని బీఎస్‌ఎఫ్ బలగాలు భారత్‌లోకి రానివ్వకపోవటంతో బంగ్లాదేశ్ బలగాలు తిరిగి వెనక్కు తీసుకెళ్లినట్టు తెలిసింది.
వీసా కేంద్రాల మూసివేత
బంగ్లాదేశ్‌లో హింస, ఉద్రిక్త పరిస్థితులు ఎంతకూ తగ్గుముఖం పట్టకపోవటంతో ఆ దేశంలోని భారత వీసా కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. ఈ మేరకు ఆన్‌లైన్ వీసా పోర్టల్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఇప్పటికే ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో అద నంగా ఉన్న సిబ్బందిని స్వదేశం రప్పించింది. వీసా సెంటర్లు ఎప్పుడు తెరుస్తారన్న విషయం తర్వాత తెలుపుతామని ప్రకటించింది.
ఐఎస్‌ఐ వల్లే మా దేశంలో హింస
బంగ్లాదేశ్‌లో హింస చెలరేగటానికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కారణమని అవామీ లీగ్ నేత, మాజీ ప్రధాని షేక్ హసీ నా కుమారుడు సజీబ్ వాజేద్ ఆరోపించా రు. తన తల్లి దేశంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఐఎస్‌ఐ ఏదో ఒకరకంగా ప్రజలను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. ప్రస్తుతం తమ పార్టీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఈ కష్ట సమయంలో ముజీబుర్ రెహమాన్ కుటుంబం వారిని ఒంటరిగా వదిలేయదని తెలిపారు.
మరో దేశానికి హసీనా?
బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చిన షేక్ హసీనా.. ఇక్కడి నుంచి మరో దేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఆమె ఏ దేశానికి వెళ్తారన్నది గోప్యంగా ఉంచుతున్నారు. ఆమె కుమారుడు, అవామీ లీగ్ నేత సజీబ్ వాజెద్ జాయ్ మాత్రం తన తల్లి తిరిగి స్వదేశానికే వస్తుందని ప్రకటించారు. అయితే, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఆమె కొంతకాలం వేరేదేశంలో తలదాచుకొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆమె కుమార్తె సైమా వాజెద్ భారత్ కేంద్రంగా పనిచేసే డబ్ల్యూహెచ్‌వో దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తన తల్లికి ఎదురైన కఠిన పరిస్థితులపై ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు ఇప్పటికే బ్రిటన్ నిరాసక్తత చూపింది. ఆమె అమెరికా వెళ్లాలన్నా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికాతో ఆమె సఖ్యతగా ఉండలేదు. దాంతో ఆ దేశం ఆమెకు ఆశ్రయం ఇవ్వకపోవచ్చు.