22-03-2025 12:07:53 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి21( విజయకాంతి): కాంగ్రెస్ పార్టీ లో ఆధిపత్య కోసం నాయకులు ఆరాటం పడుతున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రధాన నాయకులు వేరు వేరుగా గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది.
అసిఫా బాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ మధ్య వర్గ పోరు కొనసాగుతుండగా సిర్పూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్సీ దండే విఠల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రవి శ్రీనివాస్ మధ్య వర్గ పోరు కొనసాగుతుండడంతోపాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం తమ అనుచరులతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
గతంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన కుల గణన అభిప్రాయ సేకరణలో శ్యాం నాయక్ విశ్వప్రసాద్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణల నేపద్యంలో ఇరు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఫిర్యాదులు చేసుకున్న సంఘటన నెలకొంది. శ్యాంనాయక్ ఏకంగా డీసీసీ అధ్యక్షుడు తో పాటు మరో నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది.
దండే విఠల్ పై రావి శ్రీనివాస్ గతంలో పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వచ్చాడు. శ్రీనివాస్ ఇటీవల ఏకంగా తన అనుచరగణంతో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్లి తన ఆవేదననువెళ్లిబుచ్చుకోవడంతోపాటు ఆందోళన చేపట్టాడు. మంత్రి సీతక్క సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీపై బహిరం గంగానే విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ పై కూడా రావి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్న అంతర్గత విభేదాలతో అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కోనేరు కోనప్ప పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేపథ్యంలో తను రానున్న ఎన్నికల్లో అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కోనేరు కోనప్పను బుజ్జగించిన విషయం విధితమే. అయినప్పటికీ కోనప్ప పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు తనదైన శైలిలో ప్రజల్లోకి వెళుతున్నారు.
రావి శ్రీనివాస్ పై ఫిర్యాదు...
కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వారిలో తక్కువ ఓట్లు రావి శ్రీనివాస్ కు వచ్చాయని పేర్కొనడంతో పాటు నియోజకవర్గంలో ఒంటెద్దు పోకోడలతో పార్టీకి తీవ్ర రాష్ట్రం జరుగుతుందని పేర్కొన్నారు.
పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు అవడం లేదని, పార్టీ, ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేయొద్దని ఆదేశించినప్పటికీ ఈనెల 19న ఎమ్మెల్సీ ఇంటి వద్ద హంగామా సృష్టించినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. దీంతోపాటు రాష్ట్ర మంత్రి సీతక్క పై అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని , పిసిసి జనరల్ సెక్రెటరీ సత్తి మల్లేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రావి శ్రీనివాస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి తొలగించాలని లేఖలో విన్నవించారు.
నేడు, రేపు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పర్యటన...
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తోపాటు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క లు శని ఆదివారాలు పర్యటించనున్నారు. లింగాపూర్ మండలం చోర్ పల్లి గ్రామంలో ఇందిరా ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులతో హైదరాబాదులో సమావేశం నిర్వహించి వర్గ విభేదాలు లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని ఘాటుగానే హెచ్చరించినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం జరిగి దాదాపు 20 రోజుల పైగా అవుతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గ పోరుకు పుల్ స్టాప్ పడలేదు.
జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాలపై దృష్టి సారించి, ఆధిపత్య పోరు కు పుల్ స్టాప్ పెట్టేనా..? లేకపోతే పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారా...? అనే చర్చ జిల్లాలో జరుగుతుంది.