calender_icon.png 30 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడని సస్పెన్స్

30-11-2024 12:00:00 AM

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారమైనా కొత్త ప్రభుత్వం కొలువు తీరక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఈ నెల 23న ఫలితాలు ప్రకటించగా, 288 మంది సభ్యులున్న  అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయదుందుభి మోగించిఎదురులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఆ కూటమిదేననేది సుస్పష్టం.

అయినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే దానితో పాటుగా కేబినెట్‌లో కూటమి భాగస్వాములయిన బీజేపీ, శివసేన షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీకి ఎన్ని పదవులు దక్కాలనే లెక్కలు తేలలేదు. అయితే ఈ విషయంలో బీజేపీ అధినాయకత్వం తొందరపడ్డం లేదు. 132 స్థానాలు గెలుచుకున్న బీజేపీ సహజంగానే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌వైపే పార్టీ అధిష్ఠానంమొగ్గు చూపుతోంది.

ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరోసారి సీఎం పదవి కోసం మొదట్లో గట్టిగా పట్టుబట్టినా ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయిన తర్వాత మెత్తపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల నిర్ణయమే ఫైనల్ అని, తాను దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. దీంతో ఫడ్నవీస్ మరోసారి సీఎం కావడం ఖాయమని తేలిపోయింది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కోసం షిండేతో పాటుగా ఫడ్నవీస్, పవార్‌లు కూడా వెళ్లారు.

అయితే అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నద్దాలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన షిండే ప్రభుత్వం ఏర్పాటుపై మహాయుతి కూటమి తదుపరి సమావేశం ముంబయిలో శుక్రవారం జరుగుతుందని చెప్పడంతో అక్కడే అధికారిక ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. అయితే ముంబయి తిరిగివచ్చిన షిండే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని తన స్వగ్రామానికి వెళ్లడం పలు ఊహాగానాలకు కారణమవుతోంది.

షిండే శనివారం ముంబయి చేరుకుంటారని, బహుశా ఆదివారం కూటమి సమావేశం జరగవచ్చని తెలుస్తోంది. అంతేకాదు, సోమవారం లేదా 5న కొత్త ప్రభుత్వం కొలువుదీరవచ్చన్న వార్తలు కూడా వస్త్తున్నాయి.

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ అధినాయకత్వం ఎందుకు నాన్చుతోంది? దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్రలో ఏర్పాటవబోయేది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని స్పష్టమయిన నేపథ్యంలో మంత్రివర్గం కూర్పుపై అధిష్ఠానం అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఆచితూచి ముందుకు సాగుతోంది. సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ పార్టీలుండే కూటముల్లో ఇలాంటి సమస్యలు సర్వసాధారణం.

కుల సమీకరణలు, నేతల విధేయత, సత్తాలాంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని మంత్రివర్గం కూర్పు చేయాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎంతో పాటుగా హోం, ఆర్థిక, రెవిన్యూ వంటి కీలక శాఖలను భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ముందు జరిగిన మరాఠా రిజర్వేషన్ ఆందోళన, తాజా ఎన్నికల్లో అత్యధిక శాతం మంది మరాఠాలే విజయం సాధించడంతో వారికి తగినంత ప్రాధాన్యత కల్పించాల్సి రావడం కమలనాథుల ముందున్న ప్రధాన సమస్యగా చెబుతున్నారు.

మరాఠేతరుడైన ఫడ్నవీస్ సీఎం కానున్న నేపథ్యంలో పార్టీలతో సంబంధం లేకుండా తమకు అత్యధిక ప్రాధాన్యత దక్కాలని ఆయా పార్టీలలోని మరాఠా నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వంలో షిండే స్థానంపైనా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లకుపైగా పని చేసిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండడం సరికాదని శివసేనలోని ఒక వర్గం వాదిస్తున్నట్లు చెబుతున్నారు.ఏది ఏమయినా మహారాష్ట్రలో కొత్త సర్కార్‌పై సస్పెన్స్ మరో రెండు రోజులు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.