23-04-2025 12:03:14 AM
అఘాయిత్యాలకు పాల్పడు తున్న వైనం
అప్పులు ఇచ్చేటప్పుడు ఒక టైపు ఆ తర్వాత మరో టైపు
జిల్లాలో పెరుగుతున్న ఫైనాన్స్ నిర్వాహకుల ఆగడాలు
కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి),: ఫైనాన్సుల వారి ఆగడాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఫైనాన్సర్ ల ఆగడాలతో అప్పు తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. అప్పు ఇచ్చేటప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు అప్పు ఇచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నా ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తు న్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటకు చెందిన ఓ వ్యక్తి ఇల్లు తనకా పెట్టి మూడు లక్షల రుణాన్ని పొందాడు. నెలసరి వాయిదాలు పద్ధతిలో చెల్లింపులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు చేసే పని పోవడంతో కిస్తీలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. ఫైనాన్స్ వారు తమ సిబ్బందితో ఇంటికి పంపి ఇజ్జత్ తీస్తున్నారు.
దీంతో కలత చెందిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో నెలకు రెండు మూడు సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చిం ది. దేవునిపల్లిలో ఉన్న ఫైనాన్స్ కాల్ సెంటర్ ఏజెంట్ అప్పు తీసుకున్న భార్యాభర్తలను ఫోన్లో చివాట్లు పెట్టిన ఘటన వెలుగు చూ సింది. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన అనిత రెండు సంవత్సరాల క్రితం కామారెడ్డి లోని ఓ ఫైనాన్స్ నుంచి రూ. రెండు లక్షలు తీసుకున్నారు. నెలసరి కిస్తీలు రెగ్యులర్‌గా చెల్లిస్తున్నప్పటికీ ఏప్రిల్ నెలకిస్తూ చెల్లించడానికి 15 రోజులు ఆలస్యమైంది.
దీంతో అప్పు తీసుకున్న ఫైనాన్స్ కాల్ సెంటర్ ఏజెంట్ ఫోన్ చేసి తమను వేధింపులకు గురి చేస్తున్నారని భార్యాభర్తలు సోమవారం దేవునిపల్లి పోలీసులు ఆశ్రయించారు. తరచూ ఫోన్ చేస్తూ భార్యాభర్తలను దుర్భాషలాడుతున్నారని వివరించారు. కాల్ సెంటర్ వద్దకు వచ్చి హా ఫైనాన్స్ వద్దకు వచ్చి కాల్ సెంటర్ ఏజెంట్ చేస్తున్న వేధింపులను వివరించేందుకు రాగా ఫైనాన్స్ లో పనిచేస్తున్న వారు సైతం ఎందుకు రుణం తీసుకోవాలి అంటూ దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బాధితులు ‘విజయక్రాంతి’ ప్రతినిధితో వాపోయారు. రెగ్యులర్‌గా చెల్లించిన 15 రోజులు ఆలస్యం అయినందుకే ఇంత వేధిస్తున్నారని వాపోయారు.
ఇటీవల కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములను ఇంటి పై తీసుకున్న రుణాన్ని కిస్తీలు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో వారి ఇంటి వద్దకు వచ్చి గ్రామంలో వేధింపులు కు గురి చేయడంతో దేవునిపల్లి పోలీసులను ఆశ్రయిం చారు. పోలీసులు విచారణ జరిపి ఫైనాన్స్ వారి వేధింపులపై సర్ది చెప్పి పంపించారు. ఇలాంటి ఘటనలతో బాన్సువాడ ఎల్లారెడ్డి పిట్లం బిచ్కుంద జుక్కల్ మద్నూర్ మండల్ లో పలువురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఫైనాన్స్ వారు అప్పు ఇచ్చేటప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్నారని అప్పు కిస్తీలు కట్టుటంలో ఆలస్యం జరిగితే చాలు రాక్షస అవతారం ఎత్తుతున్నారు అని బాధితులు వాపోతున్నారు.
పోలీసులు చర్యలు తీసుకోవాలి
ఫైనాన్స్ వారి వేధింపులు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఫైనాన్స్ వేధింపులను ఆపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పోలీసులు ఫైనాన్సర్లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు ఫైనాన్స్ ల వారి వేధింపుల నుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.