* బంగ్లాలో మరో మూడు ఆలయాలపై దుండగుల దాడి
* విగ్రహాల ధ్వంసం కేసులో ఒకరు అరెస్ట్
ఢాకా, డిసెంబర్ 21: బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతోంది. తాజాగా బంగ్లాలో మరో మూడు దేవాలయాలపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో దేవాలయాల్లోని ఎనిమిది విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. మైమెన్‌సింగ్ ప్రాంతంలో ఉన్న రెండు దేవాలయాలపై గురు, శుక్రవారాల్లో కొందరు దుండగులు దాడి చేశారు. మరోవైపు షాకుయ్ యూనియన్‌లోని బొండెర్‌పారా ఆలయంపై మరికొందరు దాడి చేసి రెండు విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక పోలీసు అధికారి అబుల్ ఖేర్ ఈ ఘటనలపై మాట్లాడుతూ.. ఈ ఘటనలకు సంబంధించి ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు.
కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. బీల్‌దొర యూనియన్‌లోని కాళీ ఆలయంపై గురువారం దాడి జరగ్గా.. ఈ ఘటనతో సంబంధం ఉన్న 27ఏళ్ల అలాల్ ఉద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కాళీ ఆలయంపై దాడికి పాల్పడినట్టు అలాల్ తమ విచారణలో ఒప్పుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే అతడ్ని మైమెన్‌సింగ్ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే దీపజ్‌పూర్‌లోని బీర్‌గంజ్‌లో సైతం కాళీ ఆలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ కమిటీ అధ్యక్షుడు జనార్దన్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క ఏడాదిలోనే 2200 కేసులు
బంగ్లాదేశ్‌లో హిందువులపై చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగశాఖ ప్రకటించింది. డిసెంబర్ 8, 2024 నాటికి ఈ దాడులకు సంబంధించి బంగ్లాలో 2200 కేసులు నమోదైనట్టు రాజ్యసభలో పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి 112 కేసులు రికార్డయినట్టు వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం బంగ్లాలోని హిందువులపై 2022లో 47, 2023లో 302 దాడులు జరిగాయని తెలిపింది. మరోవైపు పాకిస్థాన్‌లో 2022లో 241, 2023లో 103 కేసులు నమోదైనట్టు వివరించింది. బంగ్లా, పాక్‌లలో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్ ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించింది.