calender_icon.png 27 December, 2024 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందని బిల్లులు.. కార్మికుల అవస్థలు

03-11-2024 12:41:40 AM

  1. 10 నెలలుగా బిల్ల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికుల తిప్పలు
  2. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నపం

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ ౨: మధ్యా హ్న భోజన పథకం నిర్వహణ భారంగా మారుతోంది. 10 నెలలుగా వంట చేసే కార్మికులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉంటే పిల్లలకు ఏం వండిపెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

సమయా నికి బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి మరీ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నామని వాపోతున్నారు. అదేవిధంగా 9వ, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన గుడ్ల బిల్లులు కూడా 10 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.

బకాయిలు చెల్లించడంతో పాటు తమకు కనీస వేతనం నెలకు రూ.20 వేలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తుండటం వలన పొగతో వివిధ రోగల బారిన పడుతున్నామని,  సిలిండర్లు ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 125 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తుండగా, 10 నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. 

బియ్యం మాత్రమే

మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమై దాదాపు 23 ఏళ్లు కావొస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు బియ్యం తప్ప ఏవీ కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని తెలిపారు. వంటలు చేయడానికి గిన్నెలు, పొయ్యిలు వగైరా సామగ్రి మొత్తం తామే తెచ్చుకున్నామని వివరించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు వారంలో రెండుసార్లు గుడ్లు పెట్టాలి.

ఒక గుడ్డుపై ప్రభుత్వం ఇచ్చేది రూ.5 అయితే, తాము మాత్రం రూ.7 పెట్టి కొనుగోలు చేసి విద్యార్థులకు వడిస్తున్నామని కార్మికులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 ఇచ్చే వేతనం కూడా ఎప్పుడు సకాలంలో చెల్లించింది లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే రూ.3 వేలు ఎటూ సరిపోవని.. తమ కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు.

కనీస వేతనం రూ.20 వేలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తించే విధంగా చూడాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు గురించి మండల ఎడ్యుకేషన్ అధికారి (ఎంఈవో) వివరణ కోరగా.. ఎస్టీవో(సబ్ ట్రైజరీ ఆఫీసు)కు విషయం తెలియజేశామని వెల్లడించారు.