calender_icon.png 22 September, 2024 | 3:52 PM

పొంతనలేని జవాబులు

22-09-2024 12:48:28 AM

కాళేశ్వరం క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ల క్రాస్ ఎగ్జామినేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలకు సంబంధించి శనివారం కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన సీఈలు కోలంగి బంగారయ్య, బేతు వెంకటేశ్వర్లు, చాట్ల గంగాధర్, ఉల్లి అజయ్‌కుమార్, పరాంకుశం ఏ వెంకటకృష్ణ, ఎస్‌ఈలు జంపాని శ్రీనివాసరావు, కశిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఈఈ మాలోత్ రఘురాం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సీఈ, ఎస్‌ఈ, ఈఈలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై ఇంజినీర్లను కూలంకశంగా కమిషన్ ప్రశ్నించింది. ఆనకట్టల నిర్మాణ పనుల్లో నాణ్యత, నిర్మాణ సమయంలో నాణ్యతా తనిఖీలు సంబంధిత అంశాలపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కమిషన్ అడిగిన ప్రశ్నలకు క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

వరదను తట్టుకునేలా అన్నారం బరాజ్ డిజైన్ లేదని ఆ ఈఈ కమిషన్‌కు చెప్పారు. తక్కువ వరదకు డిజైన్ చేయగా ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు సైతం బరాజ్ అను గుణంగా లేదని సమాధానమిచ్చారు. సైట్ విజిట్ ఎన్ని రోజులకొకసారి చేసేవారని కమిషన్ ప్రశ్నించగా.. రెండు మూడు నెలలకొకసారని ఒకరు, అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది.