28-08-2024 12:51:04 AM
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన ఇంజినీర్లు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఆయన వారిపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు చెందిన ఇంజినీర్లు కమిషన్ అడిగిన పలు అంశాలపై సమాధానమిచ్చారు. ఆనకట్టలకు సంబంధించిన డిజైన్ల ఆమోదానికి ముందు అనుసరించిన నిబంధనలతో పాటు ఆమోదం పొందిన తర్వాత మార్పులు, చేర్పులు, హైపవర్ కమిటీ సిఫార్సులు మొదలైన అంశాలపై పీసీ ఘోష్ సీడీసీకి చెందిన ఐదుగురు ఇంజినీర్లను ప్రశ్నించారు.
వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అఫిడవిట్‌లో వారు పొందుపర్చిన విషయానికి ఇప్పుడు చెప్తున్న విషయానికి తేడాలు ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల లొకేషన్ మార్చినట్లు ఇంజినీర్లు కమిషన్ ముందు తెలిపారు. రామగుండం సీఈ లేఖ విషయమై స్పష్టత లేని సమాధానం ఇచ్చిన ఇంజినీర్లపై ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడీఓ, ఎల్‌అండ్‌టి సంస్థ వేర్వేరుగా డిజైన్లు తయారుచేసి ఆమోదం విషయానికి వచ్చే సరికి కలిసి పనిచేసినట్లు ఇంజనీర్లు విచారణలో తెలిపారు.
మూడు బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లలో ఎలాంటి సమస్యలు లేవని ఇంజినీర్లు కమిషన్ ముందు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగానే డిజైన్లు ఉన్నాయని తెలిపారు. సీకెంట్ ఫైల్స్ కదలడం వల్లే సమస్య వచ్చిందని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందని రిటైర్డ్ ఇంజినీర్ సత్యనారాయణ రెడ్డి కమిషన్‌కు తెలిపారు. మరోవైపు జలవనరుల రంగ నిపుణులు వీ పకాష్ మంగళవారం నాడు తన అఫిడవిట్‌ను కమిషన్‌కు దాఖలు చేశారు.