calender_icon.png 27 October, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంతన కుదరని అంచనా!

29-07-2024 02:50:54 AM

బడ్జెట్‌లో కేటాయింపులు కొండంత.. ఖర్చు పిసరంత

2023-24లో పలు ప్రభుత్వ విభాగాల్లో భారీగా కోతలు 

ఎస్సీ డెవలప్‌మెంట్ నిధుల్లో 90 శాతం మేర నిలిపివేత

హౌసింగ్ శాఖకు 30 శాతం కంటే తక్కువే.. 

పరిశ్రమలు, వాణిజ్యానికి 70 శాతం తగ్గిన వైనం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): 2023-24 ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలు, ఖర్చులకు పొంతనే కుదరట్లేదు. గతేడాది భారీ అంచ నాలతో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపె ట్టగా, ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేటాయింపులకు, ఖర్చులకు భారీ తేడా ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. కొన్ని విభాగాలకు కనీసం 10 శాతం నిధులను విడుదల చేయకపోవడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర ప్రభు త్వం 2024 ఏడాదికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌ను సమర్పించిన నేపథ్యం లో గతేడాది కేటాయింపులు, ఖర్చుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. 2023 బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ అంచానాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కొన్ని శాఖల్లో 30 శాతం కూడా ఖర్చు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. గతేడాది అంచనాలకు, ఖర్చులకు భారీ తేడా ఉన్నందునే.. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం పెద్దగా పెంచలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది ఆర్థిక సంవత్సంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ౮ నెలలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, నాలు గు నెలలు కాంగ్రెస్ సర్కారు పాలించింది.

ఎస్సీ డెవలప్‌మెంట్‌కు 10 శాతం మాత్రమే 

ఎస్సీ డెవలప్‌మెంట్ విభాగానికి గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.21,072 కోట్లను కేటాయించింది. దళితబంధు లాంటి ప్రతిష్ఠాత్మక స్కీమ్‌ను అమలు చేసే ఉద్దేశంతో ప్రభు త్వం ఈ మొత్తం కేటాయించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం రూ.2,265 కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం. కనీసం 10 శాతం కూడా ఖర్చు చేయలేదనే విషయం స్పష్టమవుతున్నది. అన్ని వేల కోట్లు అంచనా వేసి, అందులో స గం కూడా కేటాయించ కపోవడంపై తీవ్రమై న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో హౌసింగ్ విభాగానికి గత ప్రభుత్వం రూ. 13,428 కోట్లు కేటాయించింది. కానీ, అం దులో ఏడాది మొత్తం ఖర్చు చేసింది కేవ లం రూ.1,723 కోట్లు మాత్రమే. ఇది కేటాయించిన మొత్తంలో 30 శాతం కూడా కాదు.  

పరిశ్రమలు, వాణిజ్యం విభాగానికి 30 శాతం కంటే తక్కువే..

బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కేటా యించిన అంచనాలు కూడా భారీగా తగ్గాయి. బీసీ సంక్షేమానికి గతేడాది రూ.6,229 కోట్లు కేటాయించారు. అందులో రూ.4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి. మైనార్టీ సంక్షేమానికి నిరుడు రూ.2,200 కోట్లు కేటాయించగా రూ.1,793 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అనుసంధానికి ట్రాన్స్‌పోర్ట్, అర్‌అండ్‌బీ విభాగంలో కేటాయింపులు, చేసిన ఖర్చుకు పొంతన లేకుండాపోయింది. 2023-24 బడ్జెట్‌లో ఈ విభాగానికి రూ.8,833 కోట్లు కేటాయించగా.. రూ.3,406 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ విభాగానికి అంచనాల కంటే దాదాపు 60 శాతం నిధులు తగ్గాయి. వాతావరణం, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి కేటాయించిన మొత్తంలో 50 శాతం కూడా ఖర్చు చేయలేదు. 

పెట్టుబడులను ఆకర్షించేందుకు గతేడాది ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్యం విభాగానికి రూ.4,037 కోట్లను కేటాయించింది. అయితే చివరాఖరికి రూ.567 కోట్లను మాత్రమే ఆ శాఖకు ఖర్చు చేశారు. అంటే, అంచనాల్లో కనీసం 30 శాతం నిధులను కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఫుడ్, సివిల్ సప్లు విభాగానికి కేటాయింపులకు ఖర్చులకు దాదాపు 50 శాతం తేడా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. గతేడాది రూ.3,117 కోట్లను కేటాయించగా రూ.1,362 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. కీలక విభాగాలన్నింటికీ గత ఆర్థిక సంవత్సంలో భారీగా కోతలు పడ్డాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, 2024-25 బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రభుత్వం చెప్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం అంచనాలను వాస్తవ రూపంలోకి తెస్తుందా? ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాబడికి వ్యయానికి అంతరం తగ్గుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

2023-24లో అంచనాలకు ఖర్చుకు మధ్య భారీ తేడా ఉన్న కొన్ని డిపార్టమెంట్లు

డిపార్ట్‌మెంట్ 2023-24 2023-24 2024-25

(బడ్జెట్ అంచనా రూ.కోట్లలో) (రివైజ్డ్ బడ్జెట్) (కేటాయింపు)

ఎస్సీ డెవలప్‌మెంట్ 21,072 2,265 7,638

హౌసింగ్ 13,428 1,723 9,184

ప్లానింగ్ 11,495 2,905 3,783

బీసీ సంక్షేమం 6,229 4,000 9,200

ట్రాన్స్‌పోర్ట్, అర్‌అండ్‌బీ 8,833 3,406 5,790

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 

పట్టణాభివృద్ధి 11,372 7,441 15,594

యానిమల్ హస్పెండరీ, 

ఫిషరీస్ 2,071 1,657 1,980

వాతావరణం, ఫారెస్ట్, 

సైన్స్ అండ్ టెక్నాలజీ 1,471 663 1,064

ఫుడ్, సివిల్ సప్లు 3,117 1,362 3,836

ఆరోగ్యం, వైద్యం, 

కుటుంబ సంక్షేమం 12,161 9,135 11,468

ఉన్నత విద్య 3,001 2,447 3,350

పరిశ్రమలు, వాణిజ్యం 4,037 567 2,762

మైనార్టీ సంక్షేమం 2,200 1,793 3,003

ట్రైబల్ వెల్ఫేర్ 4,365 2,361 3,969

మహిళలు, పిల్లలు, 

దివ్యాంగులు, వృద్ధుల విభాగం 2,131 1,775 2,736

యువ వికాసం, టూరిజం, 

కల్చర్ విభాగం 1,117 338 1,046

మొత్తం(రూ.కోట్లలో) 1,08,100 43,327 86,403