గుండమల్ల సతీష్ కుమార్
సామాన్య ప్రజలు అవసరాల నిమిత్తం వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తే జలగల్ల్లా పీక్కు తినేస్తున్నారు. ప్రజల నడ్డి విరుస్తున్నారు. వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కుకున్న సామాన్య మధ్యతరగతి , చిరు ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. అధిక వడ్డీకి మాత్రమే డబ్బు అప్పుగా ఇస్తామని నిబంధనలు పెడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వాటికి కూడా అంగీకరించి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి. మోటార్ సైకిల్ ,కారు, ఇల్లు పేపర్లు కుదువపెట్టి ఫైనాన్స్ తీసుకుంటే అసలుకు సమానంగా వడ్డీ అవుతోంది. సమయానికి కట్టకుంటే అదనపు చార్జీలు మొత్తం తీసుకున్న ఫైనాన్స్ అప్పు తీరేలోపు తడిసి మోపె డవుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేక రెండు మూడు నెలల కిస్తీలు కట్టకుంటే పరువు తీసే ప్రయత్నం చేస్తారు.
ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వసూలు చేసి తీరుతారు. అదేవిధంగా ప్రజల అవసరాలను గమనించుకొని కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన అప్పును వారం, వారం వసూలు చేసే ప్రయత్నంలో ఇచ్చిన అప్పు డబ్బులు తీరేవరకు వారం వారం చెల్లించాలనే నిబంధనలు పెట్టి నానా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వడ్డీ వ్యాపారులు కొంత ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వాలంటే భూములను, ఇండ్లను, ప్లాట్లను మార్ట్ గేజ్ రూపంలో తనఖా పెట్టుకుని అధిక వడ్డీ వసూలు చేస్తున్నావారు ఎందరో.. ఇలా తిరిగి అప్పు చెల్లించలేక కట్టిన డబ్బులన్నీ వడ్డీ కిందికి జమచేసి భూములను, ఇండ్లను, ప్లాట్లను పోగొట్టుకున్న కుటుంబాలు ఎందరో..! అదేవిధంగా చిరు వ్యాపారస్తులు డబ్బు అవసర నిమిత్తం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే డైలీ ఫైనాన్స్ రూపంలో ఇచ్చిన డబ్బులు వసూలు చేసే విధానం, అధిక వడ్డీకి మాత్రమే ఇస్తామని ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదనే పద్ధతి. అప్పు ఇచ్చే ముందే కొంత వడ్డీని కట్ చేసుకుని ఇస్తారు. రోజూ సాయంత్రం దుకాణాల దగ్గర వసూలు చేసుకుని వెళ్తారు. చిరు వ్యాపారస్తులు రోజంతా సంపాదించిన డబ్బంతా ఫైనాన్స్ కట్టడానికే సరిపోతుంది. ఇలాంటి చిరు వ్యాపారస్తులకు ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇస్తే ఇలాంటి వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించే పరిస్థితి వచ్చేది కాదు.
గత్యంతరం లేకనే
వాస్తవానికి ఎవరికైనా సరే అన్ని దారులు మూసుకుపోతేనే ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ప్రజల అవసరాలనే ఆసరాగా చేసుకుని నిబంధనలను పక్కన పెట్టి, అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వివిధ సంస్థలపై, వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి సంస్థలను, వ్యాపారస్తులను కొంత నియంత్రించకపోతే. దీనివల్ల ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ సమాజంలో ఎవరికి చెప్పుకోలేక మనస్సును చంపుకొని ,వాళ్లు వేధించే తీరుకు రాత్రుళ్లు నిద్రలు రాక బీపీలు, షుగర్ వచ్చి అనారోగ్య పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఎన్నో. .ప్రతి పట్టణంలో ఇలాంటి ఫైనాన్స్, వడ్డీ వ్యాపార సంస్థలు వందల సంఖ్యలో ఉంటున్నాయి.
ఇవి డబ్బులు ఇచ్చే పద్ధతులు దారుణంగా ఉంటా యి. ఉదాహరణకు ఇరువై ఐదు వేలు ఫైనాన్స్ తీసుకుంటే ఐదువేలు డాక్యుమెంట్ ఛార్జ్ వేస్తారు.ఆఫీస్ చార్జ్ అని మరో వెయ్యి కలిపి మొత్తం ముఫై ఒక్క వెయ్యికి ఫైనాన్స్ చేస్తారు. దీనినే కొన్ని నెలల వరకు కట్టుకుంటూ రావాలె. ఒక నెల అటో, ఇటో అయితే అదనపు చార్జీలు. గాచారం బాలేక మూడు నెలలు కిస్తీలు కట్టకుంటే వాహనం గుంజుకుపోతారు, కిస్తీలతోపాటు అదనపు చార్జీలు కడితేనే వాహనం ఇచ్చే పరిస్థితి ఉంటది. కుటుంబ ఆర్థ్దిక పరిస్థితులు, ఆనారోగ్య సమస్యలు ఏవున్నా కనీసం వినను కూడా వినరు. ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తేనే మంచిది లేకుంటే బజారుకీడుస్తామని బెదిరింపులు. ఇజ్జత్ కోసం ఉన్న బంగారమో, భూమినో అమ్మి కట్టినా, అప్పు తీరని పరిస్థితి. వడ్డీ మీద వడ్డీ తడిసి మోపెడు చేసి మెడకు రుద్దే పరిస్థితి.
అధికారులు అండగా నిలవాలి
ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు,వడ్డీ వ్యాపారుల ఊబిలో చిక్కుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత అండగా ఉండాలి అధికారులు. అందరూ బయటికి చెప్పుకునే పరిస్థితులు ఉండవు కాబట్టి అధికారులు వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలను కాపాడాలి.