calender_icon.png 16 November, 2024 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరవని తెలుగు తేజాలు

13-08-2024 12:28:21 AM

  1. సింధు, నిఖత్ జరీన్, శ్రీజ విఫలం 
  2. తృటిలో పతకం చేజార్చుకున్న ధీరజ్ 
  3. షూటింగ్, అథ్లెటిక్స్‌లోనూ నిరాశే

ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన మన అథ్లెట్లు

విజయక్రాంతి ఖేల్ విభాగం: పారిస్ ఒలింపిక్స్‌లో తెలుగు అథ్లెట్లు విఫలమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు కొన్నేళ్లుగా ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో ఈసారి ఒలింపిక్స్‌లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు అదరగొడతారని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. మొత్తం 117 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది ఒలింపిక్స్‌కు వెళ్లారు. వారిలో బ్యాడ్మింటన్ విభాగం నుంచి పీవీ సింధు, డబుల్స్ నుంచి సాత్విక్ సాయిరాజ్‌లు ఉన్నారు. బాక్సింగ్ నుంచి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్‌లో వరంగల్ చిన్నది ఆకుల శ్రీజ, షూటింగ్‌లో ఇశా సింగ్, ఆర్చరీ నుంచి ధీరజ్ బొమ్మదేవర, అథ్లెటిక్స్ నుంచి జ్యోతి యర్రాజీ, దండి జ్యోతికలు బరిలోకి దిగారు.

వీరిలో ధీరజ్ ఒక్కడే పతకం చేరువగా వచ్చి తృటిలో కాంస్యం చేజార్చుకున్నాడు. ఒలింపిక్స్‌లో మూడో పతకం సాధిస్తుందనుకున్న షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌కే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కొన్నేళ్లుగా అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టి డబుల్స్‌లో నెంబర్‌వన్‌గా ఎదిగిన సాత్విక్ సాయిరాజ్ శెట్టి జోడీ పారిస్‌లో మాత్రం పతకం తేవడంలో విఫలమైంది. ఆర్చరీలో తృటితో పతకం మిస్ అయినా ధీరజ్ బొమ్మదేవర తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వచ్చే ఒలింపిక్స్ నాటికి ఇతని నుంచి మనం పతకం ఆశించొచ్చు. 

 ప్చ్.. ధీరజ్

ఈసారి విశ్వక్రీడల్లో తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర అదరగొట్టాడు. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో ఓడిన ధీరజ్ .. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అంకితతో కలిసి సెమీస్ చేరి పతకంపై ఆశలు రేపాడు. సెమీస్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన భారత్ కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. అమెరికాతో జరిగిన కీలక కాంస్య పోరులో ధీరజ్ గురి అదిరినప్పటికీ అంకిత తీవ్ర ఒత్తిడిలో బాణాలు సరిగ్గా వేయలేకపోయింది. దీంతో అమెరికా చేతిలో 6 భారత్ పరాజయం చవిచూసి తృటిలో పతకం చేజార్చుకుంది.

అథ్లెటిక్స్‌లో నిరాశే

అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల హార్డిల్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి యర్రాజీ నిరాశపరిచింది. హీట్స్‌లో వెనుకంజ వేసినప్పటికీ రెపిచేజ్ ద్వారా వచ్చిన మరో అవకాశాన్ని కూడా జ్యోతి వృథా చేసుకుంది. ఇక మహిళల 4x400 మీ రిలే ఈవెంట్‌లో దండి జ్యోతిక బృందం సెమీస్ చేరడంలో విఫలమైంది. నిరాశజనకమైన ప్రదర్శనతో భారత బృందం హీట్స్‌లోనే ఇంటిబాట పట్టింది.

సింధూ కూడా..

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన పీవీ సింధు పారిస్‌లో మాత్రం అద్భుతం చేయలేకపోయింది. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సింధూ ప్రిక్వార్టర్స్ చేరి పతకంపై ఆశలు పెంచింది. తన బలహీతనగా భావించే చైనా అడ్డుగోడను దాటడంలో సింధు విఫలమైంది. ప్రిక్వార్టర్స్‌లో బింగ్ జియావో చేతిలో ఓటమి చవిచూసిన సింధూ హ్యాట్రిక్ పతకం లేకుండానే స్వదేశానికి తిరుగపయనమయ్యింది. డబుల్స్‌లో సాత్విక్ జోడీ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. గ్రూప్ దశలో ఒక మ్యాచ్ రద్దు చేసుకున్న ఈ జంట రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థుల పని పట్టి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఒక్క అడుగు వేసి ఉంటే భారత్ ఖాతాలో పతకం చేరేదే. కానీ కీలక క్వార్టర్స్ పోరులో సాత్విక్ జంట ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో వెనక్కి వచ్చారు.

శ్రీజ విఫలం

టేబుల్ టెన్నిస్‌లో బరిలోకి దిగిన వరంగల్ అమ్మాయి శ్రీజ ఆకుల నిరాశపరిచింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీజ.. మహిళల టీం విభాగంలో మనిక బత్రా, అర్చనా కామత్, శ్రీజలతో కూడిన భారత జట్టు క్వార్టర్స్ చేరి సంచలనం సృష్టించింది. కానీ క్వార్టర్స్ పోరులో జర్మనీ చేతిలో ఓటమి చవిచూసిన శ్రీజ అండ్ కో సెమీస్ చేరడంలో విఫలమైంది. దీంతో పతకం తెస్తుందని ఆశించిన శ్రీజకు నిరాశే ఎదురైంది. అయితే 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మిక్సడ్ టీం విభాగంలో శరత్ కమల్‌తో కలిసి శ్రీజ స్వర్ణం సాధించి సంచలన సృష్టించింది. అంతేకాదు వ్యక్తిగత విభాగంలోనూ మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన శ్రీజ విశ్వక్రీడల్లో మాత్రం విఫలమైంది.

సరిపోని పంచ్

రెండుసార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్స్‌కు ముందు తాను పాల్గొన్న చివరి టోర్నీలో స్వర్ణం.. అంతకముందు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పసిడి.. ఈ ట్రాక్ రికార్డు చూసి మన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఈసారి ఒలింపిక్స్‌లో అదరగొడుతుందని అంతా ఆశించారు. టోక్యో ఒలింపిక్స్‌కు చివరి నిమిషంలో దూరమైన నిఖత్ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. తొలి రౌండ్‌ను దిగ్విజయంగా దాటిన నిఖత్ ప్రిక్వార్టర్స్‌లో తేలిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ ముందు నిఖత్ పంచ్ సరిపోలేదు. తొలిసారి ఒలింపిక్స్ ఆడిన నిజామాబాద్ చిన్నది పతకం తేవడంలో విఫలమైంది.

ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు షూటింగ్‌లోనే మూడు పతకాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అదే షూటింగ్‌లో బరిలోకి దిగిన మన హైదరాబాదీ షూటర్ ఇశా సింగ్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. మహిళల పిస్టల్ 25 మీటర్ల వ్యక్తిగత విభాగంలో బరిలోకి దిగిన ఇశా 18వ స్థానంలో నిలిచి క్వాలిఫికేషన్‌లోనే ఇంటిదారి పట్టింది. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇశా కనీసం వచ్చే ఒలింపిక్స్ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని ఆశిద్దాం.