05-03-2025 01:09:01 AM
జగిత్యాల అర్బన్, మార్చి4: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబ్ లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు పట్టణంలోని పలు ల్యాబ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇందులో భాగముగా పాత బస్సు స్టాండ్ సమీపములోని దుర్గా ల్యాబ్ ను సీజ్ చేశారు. లక్ష్మి ల్యాబ్ మూసి వేయడం తో వెంటనే రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. జంబి గద్దె సమీపములోని కేర్ ల్యాబ్ ను సీజ్ చేసి, తేజస్విని ల్యాబ్ మూసి ఉండడం తో వెంటనే రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఫోన్ సంభాషణ ద్వారా ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రయివేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుష్ ఆసుపత్రులు, డెంటల్ ఆసుపత్రులు, కంటి ఆసుపత్రులు, మెడికల్ ల్యాబొరేటరీలు అన్ని విధిగా క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్ 2010 క్రింద రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆదేశించారు.
ఇంతకూ మునుపు రిజిస్టర్ ఆయిన ఆసుపత్రులు గడువు ముగియక ముందు రేన్యువల్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన పిమ్మట దరఖాస్తు చేసుకుంటే గడువు ముగిసిన తేదీ నుండి దరఖాస్తు తేది నాటికి క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్ రూల్ 25 (1) క్రింద రోజుకు రు.100 చొప్పున జరిమానా విధించడం జరుగుతున్నారు.