calender_icon.png 10 March, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ

10-03-2025 12:00:00 AM

పట్టించుకోని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు

కరీంనగర్, మార్చి 9 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో పుట్ పాత్ ల ఆక్రమణ జోరుగా సాగుతోంది. స్మార్ట్‌సిటీ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం అనంతరం ఫుట్పత్‌లపై ఉన్న దుకాణాలను, వ్యాపారాలను తొలగించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు కొద్దిరోజులపాటే దృష్టి సారించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దుకాణ సముదాయంలోకి వీధి వ్యాపారులను మారుస్తామని ప్రకటించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో తొలుత ఫుట్ పాత్ వ్యాపారాలకు అడ్డుకట్టవేశారు.

అయితే అది కొద్దిరోజులపాటే కొనసాగింది. స్మార్ట్ సిటీ రోడ్లకిరువైపులా ఫుట్ పాత్ లను నిర్మించి వాటిని సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధిపరిచారు. అయితే నేడు ఈ ఫుట్ పాత్ లను ఆక్రమించి జోరుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. శాతవావన యూనివర్సిటీ రోడ్, డాక్టర్స్ స్ట్రీట్, కలెక్టరేట్ రోడ్తోపాటు ఆర్‌అండ్ బి ప్రధాన రహదారులు, ఇతర చోట్ల ఫుట్పాత్ లను ఆక్రమణ యదేచ్చగా కొనసాగుతోంది.

టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర చిరువ్యాపారులు ఫుట్పాత్ లో వరకు షెడ్లను నిర్మించి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ రోడ్డుపై ఒకపక్క నైట్ ఫుడ్ కోర్టులు కొనసాగుతుండగా, మరోపక్క వాటికి పోటీగా ఫుటపాత్లపై వ్యాపారాలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే వీలు లేకుండా అడ్డంగా తాత్కాలిక టేలాలను ఏర్పాటు చేసి ఆక్రమణ కొనసాగిస్తున్నారు.

ఫుడ్ కోర్టుల సమీపంలో కూడా ఫుడ్ కోర్టుల నిర్వాహకులు వారికి కేటాయించిన స్థలంలో కాకుండా పక్కన తాత్కాలిక షెడ్లు నిర్మించి వ్యాపారం కొనసాగిస్తున్నారు. చిరువ్యాపారుల కోసం శాతవాహన యూనివర్సిటీ రోడ్, డాక్టర్ స్ట్రీట్లలో దుకాణాల సముదాయాలను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు డ్రా పద్ధతిన నెలసరి అద్దెకు దుకాణాలను కేటాయించారు.

అయితే శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. కేటాయించబడ్డ వీధి వ్యాపారులు కూడా అద్దెకు భయపడి రాకుండా పోతున్నారు. దీంతో వీధి వ్యాపారులు యధావిధిగా పుట్వాత్లపై కూరగాయల వ్యాపారం నుంచి మొదలు టిఫిన్ సెంటర్ల వరకు వ్యాపారం చేసుకుంటున్నారు. నిత్యం రద్దీ ఉండే రోడ్లపై పండగల సమయాల్లో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

టవర్ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి నలువైపులా సీసీ రోడ్లు నిర్మించారు. ఇక్కడ కూడా వ్యాపారులు ముందు వరకు వచ్చి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తుండడంతో ఇరుకైన రోడ్లు ఉన్న ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు నిత్యం అంతరాయం ఏర్పడుతుంది.