23-02-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కోట్లాదిమంది ఎట్ల ఏకమయ్యారు? వీరందర్ని ఎవరు ఏకం చేశారు? పసిబిడ్డ దగ్గర నుంచి ముసలవ్వ వరకు రాష్ట్రసాధన ఉద్యమంలో ఎలా కదలివచ్చారు? కోట్లాది గొంతుల్ని ఏకం చేసిదేమిటి? తెలంగాణలో గడపగడప కదలటానికి కావాల్సిన ఆలోచనా ధోరణులను అందించినవారెవ్వరు? ప్రజలను కదిలించడానికి భావజాల విత్తనాలను ఈ నేలంతా చల్లిందెవరు? ప్రజల కదలికకు పునాదులు వేసినవారెవరు?.. అంటే యూనివర్సిటీ విద్యార్థుల పాత్రే చాలా కీలకం అంటున్నారు కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ జేఏసీ చైర్మన్, మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ సాదు రాజేశ్. కేయూలో నాడు జరిగిన ఉద్యమ ఘట్టాలను ‘వీర తెలంగాణ’తో పంచుకున్నారాయన..
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది కాకతీయ విశ్వవిద్యాలయం. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ చేయి కలిపారు.. గొంతు కలిపారు. ఉద్యమంలో నిత్యం నిర్బంధాలను ఎదుర్కొని ముందుకు సాగారు. స్వరాష్ట్ర సాధనలో ఎవరి పాత్రను తక్కువగా అంచనా వేయలేం. ముఖ్యంగా కేయూ జేఏసీ అన్నిటికంటే భిన్నమైనది. ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, మేధావులు, మా గురువులు అందరూ తెలంగాణ పల్లెల మీద అధ్యయనం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి ఒక భావజాలాన్ని తీసుకురావడంలో మా ప్రొఫెసర్లు చాలా కీలకంగా పనిచేశారు. ప్రొ. జనార్దనరావు, ప్రొ. పాపిరెడ్డి, ప్రొ. వెంకటనారాయణ, ప్రొ. గుర్రం రాములు, ప్రొ. కాత్యాయని, ప్రొ. జ్యోతిరాణి, ప్రొ. మురళిమనోహర్.. ఇలా అందరూ గ్రామాల్లో అధ్యయనం చేశారు. గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది.. మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేవారు.
వాళ్ల రచనలు, పుస్తకాలను పరిశోధన విద్యార్థులుగా మేం చదువుకునేది. వాళ్లు పెట్టే సదస్సుల్లో పాల్గొనేది. అట్ల తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక అవగాహన మాలో ఏర్పడ్డది. మా ఊర్లు వేరైనా మా నినాదం మాత్రం ఒక్కటే.. తెలంగాణ వాదం. నాడు తెలంగాణలోని ప్రతి పల్లె సీమాంధ్ర నాయకుల చేతిలో అన్యాయానికి గురైందని గ్రహించి ఉద్యమంలో మా వంతు బాధ్యతను నిర్వహించాం.
కేసీఆర్ అరెస్టును ఖండిస్తూ..
2009 నవంబర్ 23న కేసీఆర్ ఆమరణ దీక్షకు వెళ్లేముందు కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చి బహిరంగ సభ నిర్వహించారు. అన్నీ యూనివర్సిటీల కంటే ముందుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పడ్డది. ఆ సభ విజయవంతం అయింది. అదే సందర్భంగా చాలా విషయాలను విద్యార్థులతో కేసీఆర్ పంచుకున్నారు.
ఆ తర్వాత 2009 నవంబర్ 29న ఆయన ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.. కేసీఆర్ అరెస్టును ఖండిస్తూ అన్ని యూనివర్సిటీల విద్యార్థులం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశాం. అట్ల ఆయనను కరీంనగర్ నుంచి వరంగల్ మీదుగా ఖమ్మం తీసుకుపోతున్న సమయంలో కేయూలో తరగతులు బహిష్కరించి, రెండో గేటు దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు చేశాం.
తెలంగాణ అస్థిత్వం కోసం
నాడు తెలంగాణ అస్థిత్వ నినాదాన్ని ఎత్తుకున్న ఓ రాజకీయ నాయకుడిని.. సీమాంధ్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఖండించాం. కేయూ ఉద్యమాలకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రొ. జయశంకర్, ప్రొ. హరగోపాల్, ప్రొ. బాలగోపాల్ లాంటి వారు తెలంగాణ ఉద్యమ బీజాలు వేశారు. 1969 నుంచి కూడా కాకతీయ యూనివర్సిటీలో మా సీనియర్స్, టీచర్లతో చర్చలు.. అదే విధంగా చిన్న చిన్న రీసెర్చు ప్రాజెక్టులు తెలంగాణ అంశంపై చేయడంతో కేయూలో తెలంగాణ పట్ల ఒక అవగాహన ఏర్పడింది.
ఇది టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడక ముందు సంగతి. ఏ పార్టీ రాజకీయ నాయకుడైతే ఏంటి తెలంగాణ కోసం కోట్లడుతున్నడు కదా అనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ.. వందలాది మంది విద్యార్థులతో అడ్డుకున్నాం.. వాహనాలకు అడ్డుపోయి లాఠీ దెబ్బలు తిన్నాం. కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా కేసీఆర్ ఆమరణ నిరాహర దీక్ష చేసి.. తర్వాత దొంగ నిరాహర దీక్ష అని తెలవడంతో అదే రోజు అర్ధరాత్రి ౧౨ గంటలకు కేసీఆర్ దిష్టిబొమ్మతో శవ యాత్ర కూడా చేసిన విషయం మరిచిపోలేం.
రాయినిగూడెం సభ..
కేయూ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో 14 విద్యార్థి సంఘాలతో కలిసి పనిచేశాం. ప్రస్తుత ములుగు జిల్లా రాయినిగూడెంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఐదు వేల మంది పోలీసు బలగాలను రక్షణగా పెట్టుకుని వస్తున్న సందర్భంలో.. రెండు రోజుల ముందుగానే కేయూ జేఏసీ విద్యార్థులం రాయినిగూడెంకు వెళ్లాం.
ఐదు వేల మంది పోలీసులు, ౩౨ చెక్‌పోస్టులు పెట్టినా.. తప్పించుకుని అక్కడికి చేరుకున్నాం. దురదృష్టం కొద్దీ మీటింగ్ ప్రారంభం కాకముందే గ్రామంలో ఇంటింటిని చెక్‌చేసి మమ్మల్ని అరెస్టు చేశారు. కవిత, సావిత్రి, జ్యోతి, కృష్ణలత అనే నలుగురు మహిళా విద్యార్థులు మీటింగ్ జరిగే రోజు తెల్లవారుజామున మారువేశంలో వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. ఈ ఘటన అన్ని యూనివర్సిటీల మీద తెలంగాణ ప్రజలపై విపరీతమైన ప్రభావాన్ని చూపెట్టింది.
మానుకోట ఘటన..
మానుకోట ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. కేయూ విద్యార్థులుగా మేం వరంగల్ నుంచి మూడు, నాలుగు రోజుల ముందే మానుకోటకు వెళ్లి, అక్కడ మా విద్యార్థులను ఎడ్యుకేట్ చేశాం. అక్కడ ఉన్న రైలు పట్టాలను తొలగించాం. ఆ రైలు పట్టాల మీద మంటలు పెట్టి కాల్చివేశాం. తెల్లవారుజామున టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్న సందర్భంలో అప్పటి కాంగ్రెస్ లీడర్లు కొండా మురళి, కొండా సురేఖ తమ అనుచరుల చేతుల్లో మా విద్యార్థి నాయకులు పలువురు దెబ్బలు తిన్నారు. రక్తం కారేలా కొట్టారు.
కేసులు, జైలు పాలయ్యారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర పేరుతో మానుకోటకు రావడాన్ని మేం వ్యతిరేకించాం. మానుకోటకు వస్తే మన అస్థిత్వం మీద దెబ్బపడుతుందని ఉద్దేశంతో పోరాటం చేశాం. తర్వాత అన్ని యూనివర్సిటీ నుంచి విద్యార్థులు టీమ్‌లుగా ఢిల్లీ జేఎన్‌యూలో పెద్ద ర్యాలీ తీశాం. సోనియాగాంధీ ఇంటి ముందు ఆందోళన చేశాం. బీజేపీ, సీపీఐ ఇలా అన్నీ పార్టీ నాయకులను కలిసి తెలంగాణ సాధనకు మద్దతు ఇవ్వాలని కోరాం. తెలంగాణ వాయిస్ జాతీయ స్థాయిలో వినిపించాలనే ఉద్దేశ్యంతో ఆ కార్యక్రమం చేశాం.
అంబులెన్స్‌ల్లో యూనివర్సిటీకి..
2011 మార్చి 10న హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ పెద్ద ఎత్తున జరిగింది. అందులో పాల్గొనేందుకు కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబులెన్స్‌ల్లోనే వందలాది విద్యార్థులం ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నాం. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. మిలియన్ మార్చ్ కార్యక్రమం ఉద్యమ పోరాటంలో పెద్ద అనుభూతిని మిగిల్చింది.
నాడు ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు మేరకు మిలియన్‌మార్చ్ సక్సెస్ చేయడంలో పొలిటికల్, విద్యార్థి జేఏసీలు చాలా కీలకమైన పాత్ర పోషించాయి. పాలకుర్తిలో చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పల్లెల్లో తిరగడం కోసం సభ ఏర్పాటు చేశారు. కేయూ విద్యార్థులం దాదాపు 50 కిలోమీటర్లు కాలినడక అక్కడికి వెళ్లాం. ఎక్కడిక్కడ పోలీసు బందోబస్తులు, అడ్డంకులు, అరెస్టులతో వాహనాల్లో వెళ్లకపోయేది.
అలా పాలకుర్తి సభను బహిష్కరించాం. అదే రోజు టీడీపీ గుండాల చేతుల్లో విద్యార్థులు తీవ్రంగా దెబ్బలు తిన్నారు. ఒక దశలో విద్యార్థులను ఎన్‌కౌంటర్ చేసే ఆలోచన కూడా సీమాంధ్ర నాయకులుకు ఉండేది. మాపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. నాపై వందకు పైగా కేసులు నమోదు చేశారు. అవన్నీ స్వరాష్ట్రం ఆవిర్భావం అయ్యాక కొట్టేశారు.
విలువైన కాలాన్ని కోల్పోయాం..
స్వరాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే దక్కుతాయని ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నం. కానీ, ఉద్యమంలో మా విలువైన జీవితాలను పోగొట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడ్డక ఉద్యమకారులు ఎలాంటి న్యాయం జరగలేదు. విద్యార్థి నాయకులకు ఒక కార్పొరేషన్ పెట్టమని ప్రభుత్వం చుట్టూ తిరిగాం.. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి కూడా మాట్లాడాం. ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు.