calender_icon.png 24 March, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వవిద్యాలయాలు భావసంఘర్షణ కేంద్రాలు

22-03-2025 11:42:37 PM

ఓయూ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలి..

రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): విశ్వవిద్యాలయాలు భావసంఘర్షణ కేంద్రాలని, అలహాబాద్ యూనివర్సిటీలో ఓ కాన్వకేషన్‌కు హాజరైన సందర్భంగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ధర్నాలను నిషేదిస్తూ ఇటీవల ఇచ్చిన సర్క్యులర్‌పై ఉస్మానియా, విప్లవ విద్యార్థి సంఘం పూర్వవిద్యార్థులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. డేవిడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు అమర్, కవి. నందినిసిదారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ నాయకుడు స్టాలిన్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెవి చలపతిరావు, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ... ఓయూ సర్క్యులర్ విషయం తెలిసి పూర్వ విద్యార్థిగా, అధ్యాపకుడిగా భాదేసిందన్నారు. హెచ్‌సీయూలోని 400ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ప్రకృతిని విధ్వంసం చేయబోతుందన్నారు. విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలు అనే అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. విశ్వవిద్యాలయాలన్నీ వేరు ఓయూ వేరని, ఉస్మానియా యూనివర్సిటీ విజ్ఞానం నేర్పడంతో పాటు ఉద్యమాలను నేర్పుతుందని నందిని సిదారెడ్డి అన్నారు. సామాజిక చైతన్యానికి ఓయూ ఒక కదలిక అని చెప్పారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్‌లోకి పోలీసులు లోనికి పోయి విద్యార్థులను అరెస్ట్ చేయడం బాధాకరమని వీక్షణం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

సర్క్యులు ఇవ్వడానికి ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రచురించిన వార్తలలో తప్పులుంటే రిజైండర్ ఇస్తారని, కానీ ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్‌కు రిజైండర్ ఇవ్వడమేంటని సీనియర్ జర్నలిస్ట్ అమర్ ప్రశ్నించారు. విద్యార్థులు ఫిర్యాదులు అధికారులకే తెలుపుతారని, మైదానాల్లో నిరసనలు తెలుపుకోమంటే ఎలా అని అన్నారు. విద్యాప్రమాణాలు కాపాడడం కోసం క్రమశిక్షణ అనే మాట సరికాదని కె.శ్రీనివాస్ అన్నారు. ఓయూ అధికారులు విద్యార్థులు భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విద్యార్థి ప్రతినిధులు గవర్నింగ్ బాడీలో ఉండాలని సూచిచారు. ఏడవ హామీ స్వేచ్ఛ అని చెబుతూనే, జర్నలిస్టులు గుడ్డలు లేకుండా తిరగాలని అసెంబ్లీ సాక్షిగా వినాల్సి వచ్చిందని అల్లం నారాయణ అన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 70శాతం అధ్యాపకులు లేరని, ఆర్ట్స్ కాలేజీ స్మశానాన్ని తలపిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వానికి పడదని పేర్కొన్నరు. ఎవరు నిరసనలు తెలిపినా అసాంఘీక శక్తులున్నాయని పోలీసులు మాట్లాడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు స్టాలిన్ విమర్శించారు.