calender_icon.png 31 January, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలు సద్వినియోగం చేసుకునేలా యూనిట్ అధికారులు కృషి చేయాలి

31-01-2025 04:33:36 PM

కలెక్టర్ జితేష్ వి పాటిల్...

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజనుల కొరకు ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న వివిధ రకాల జీవనోపాధికి సంబంధించిన పథకాలు గిరిజనుల కుటుంబాలు సద్వినియోగం చేసుకొని జీవించేలా యూనిట్ అధికారులు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాంబర్లో ఐటీడీఏ పీవో బి. రాహుల్ తో కలిసి ఐటీడీఏ యూనిట్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిసిసి ద్వారా గిరిజనుల నుండి సేకరించే కరక్కాయ ఇప్ప పూలు విషముష్టి వివిధ ఔషధ గుణాలకు సంబంధించిన గింజలు కొనుగోలు చేయడమే కాక గిరిజనులు వాటిని మార్కెటింగ్ చేసుకునేలా ప్రతి డి ఆర్ డిపోలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి వారే సొంతంగా అమ్ముకునేలా చూడాలని, ఇప్ప పూలు ద్వారా నూనె తీసి అమ్ముకోవడానికి యంత్రాలు సమకూరుస్తామని, వాటికి సంబంధించిన శిక్షణ గిరిజన మహిళలకు అందిస్తామని అన్నారు.

గిరిజన పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇప్ప పూలు సేకరణ గురించి అవగాహన కల్పించి, వేసవి సెలవులలో ఇప్ప పూలు మొక్కలు నాటించి ప్లాంటేషన్లు ఏర్పాటు చేసేలా చూడాలని, ఎక్కువ శాతం ఇప్ప పూలు సేకరించిన పిల్లలకు ప్రోత్సాహకాలు అందించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా పనస చెట్లు, జీడి మామిడి చెట్లు, మునగా చెట్లు తప్పకుండా నాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాలల్లో కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్లలో గ్రైండర్, స్టీమ్ కుక్కర్లు రిపేర్ చేయించాలని, కరెంటు అవసరం ఉన్నచోట సోలార్ ప్యానల్ ద్వారా కరెంట్ సౌకర్యం కల్పించాలని అలాగే ఇంజనీరింగ్ విభాగం ద్వారా గిరిజన గ్రామాలలో రోడ్లు, పొలాలకు మట్టితో తయారుచేసిన సిమెంటును వేసి రోడ్లు వేయించాలని, సిమెంటు ఇటుకలు తయారీ కొరకు న్యాక్ ద్వారా శిక్షణ తీసుకున్న గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేలా చూడాలని, జాబు కార్డు హోల్డర్లకు ఈజీఎస్ ద్వారా 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించి, ఖాళీ సమయంలో ఉన్నతి క్యాంపు శిక్షణ ద్వారా బోర్వెల్ ఉన్న గిరిజన రైతులకు పాంపాడ్ నిర్మించుకునేలా చూడాలని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గిరిజన గ్రామాలలో పీహెచ్సి లలో పనిచేసే డాక్టర్లు సమయపాలన పాటించే విధంగా చూడాలని, నిర్లక్ష్యం వహించే డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

కొండరేడ్ల గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వారి పొలాలలో వెదురు మొక్కలు, పామ్ ఆయిల్ మొక్కలు నాటించి అంతర్ పంటలుగా కూరగాయలు, ఆకు కూరలు అలాగే మునగ చెట్లు వేసుకునేలా అవగాహన కల్పించాలని, వర్షపు నీరు వృధా పోకుండా వాటర్ షెడ్ ద్వారా పర్పలేస్ థాంక్స్, చిన్న చిన్న చెక్ డ్యాములు నిర్మించుకునేలా చూడాలని అన్నారు. విద్యుత్ సౌకర్యం లేని గిరిజన గ్రామాలలో ఫారెస్ట్ వారి అనుమతి తీసుకొని విద్యుత్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి రాంబాబు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఆర్ సి ఓ గురుకులం నాగార్జున రావు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, డి ఎం జి సి సి సమ్మయ్య, ఏపీవో పవర్ వేణు, ఎఫ్డిసి ఉదయ్ కుమార్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.