16-03-2025 09:15:12 PM
నాగ్‌పుర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కుల వివక్షపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ... ఎవరైనా కుల వివక్ష గురించి మాట్లాడితే ఊరుకోనని స్పష్టం చేశారు. కుల మతాలు, భాష తదితరాల ఆధారంగా సమాజంలో ఎవరిపైనా కూడా వివక్ష చూపకూడదని అన్నారు. దేశా అభివృద్ధి, సమాజ వికాసానికి విద్య అత్యంత కీలకమైనదని చాటిచెప్పారు. కులం, మతం, భాష వల్ల గొప్ప వ్యక్తి కాలేరని, వ్యక్తికి ఉన్న గుణాల ఆధారంగానే గొప్పవారు అవుతారని తెలిపారు. అందుకోసమే ఎవరిపైనా వీటి ఆధారంగా వివక్ష ప్రదర్శించొద్దని అన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నా.. నా చుట్టూ చాలా విషయాలు ఎప్పుడూ జరుగుతుంటాయి. కానీ, నేను మాత్రం నా దారిలోనే నడుస్తానని సూచించారు.
ప్రజలు నాకు ఓటేయాలనుకుంటే వేయొచ్చు, వద్దనుకొనే స్వేచ్ఛ కూడా వారికి ఉందన్నారు. నా తీరు గురించి స్నేహితులు అడుగుతుంటారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు కాదని వారికి జవాబు ఇస్తానన్నారు. కానీ విలువల విషయంలో మాత్రం అస్సలు రాజీపడను అని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. సమాజంలో విద్యను ప్రోత్సహించేందుకు గతంలో తాను ఓ మైనారిటీ విద్యాసంస్థకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు అయ్యేలా చొరవచూపిన విషయాన్ని గడ్కరీ గుర్తుకు చేసుకున్నారు. ఈ విషయంలో తనను చాలామంది ప్రశ్నించారని... కానీ, విద్య అత్యంత అవసరం అయినవారు మైనారిటీలే అని వెల్లడించారు. ఒక వ్యక్తి కులమతాలు, భాష, లింగ వివక్షకు అతీతంగా ఎదిగినప్పుడే.. గొప్పవారు కాగలరని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు.