21-04-2025 12:21:25 PM
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం(Hyderabad Local Bodies MLC Election Meeting) జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇతర పార్టీల కార్పొరేటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించాలని మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ కు బాస్ రాహుల్ గాంధీ అయితే.. ఆయనకు బాస్ అసదుద్దీన్ అని కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తెలిపారు. బీఆర్ఎస్ కు బాస్ కేసీఆర్ అయితే.. ఆయన సూపర్ బాస్ అసదుద్దీన్ అని చమత్కరించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడంలేదో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటింగ్ లో పాల్గొనవద్దని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Hyderabad MLC Elections) కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీచేయకుండా మజ్లిస్‌కు అండగా ఉంటున్నాయన్నారు. కార్పొరేటర్లను ఓటువేయకుండా బీఆర్ఎస్ బెదిరిస్తోందని తెలిపిన కిషన్ రెడ్డి ఇది ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని వెల్లడించారు. మతోన్మాద మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యూలర్ పార్టీలు ఎలా అవుతాయని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.