calender_icon.png 23 January, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24న కరీంనగర్‌కు కేంద్ర మంత్రి ఖట్టర్ రాక

22-01-2025 01:36:18 AM

బహిరంగ సభాస్థలిని సందర్శించిన బండి సంజయ్

కరీంనగర్, జనవరి 2౧ (విజయ క్రాంతి):  కేంద్ర పట్టణాభివ్రుద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈనెల 24న కరీంనగర్‌కు రానున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హౌజింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన 24 గంటల పాటు నిరంతరాయంగా తాగు నీటి సరఫరా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.

వీటితోపాటు అంబేద్కర్ స్టేడియంలో రూ.22 కోట్లతో నిర్మించిన స్పోరట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను ప్రారంభిస్తారు.  అట్లాగే రూ.8.2 కోట్లతో మల్టీపర్సస్ స్కూల్ లో చేపట్టిన పార్క్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ పార్క్ అభివ్రుద్ధి పనుల ప్రారంభిస్తారు. 

అలాగే నగరంలోని పద్మా నగర్ లో రూ.14 కోట్లతో నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ భవనాన్ని ప్రారంభిస్తారు.  కేంద్ర మంత్రి ఖట్టర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పేయి అంబేద్కర్ స్టేడియం వద్ద నిర్మించిన స్పోరట్స్ కాంప్లెక్స్, మార్వాడీ గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్  ప్రాంతాలను సందర్శించారు.

అభివ్రుద్ధి పనులను పరిశీలించారు. అట్లాగే హౌజింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలి ప్రాంగణాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి ఖట్టర్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు.