calender_icon.png 2 April, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది పండుగకు సిద్ధమైన శ్రీ మహాశక్తి దేవాలయం.

29-03-2025 04:12:12 PM

ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు పూర్తి 

పంచాంగ శ్రవణానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం చైతన్యపురిలోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయం తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు సిద్ధమైంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలను పురస్కరించుకొని శ్రీ మహాశక్తి దేవాలయానికి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి తరలివచ్చే అశేష భక్తులకు కనువిందు చేసేలా  అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణతో పాటు దేవాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం రోజున ఉగాది పండుగను పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం 4:30 గం.లకు  శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి అమ్మవార్లకు అభిషేకం అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు ఉగాది పచ్చడి వితరణ, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాలయంలో జరుగునున్న పంచాంగ శ్రవణ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హాజరుకానున్నారు.  ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా విచ్చేస్తున్న ఉగాది (తెలుగు నూతన సంవత్సరం) విశ్వావసు నామ సంవత్సరంలో దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సమస్త హిందూ బంధువులంతా పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.