మణుగూరు (విజయక్రాంతి): ప్రజా యుద్ధనౌక విప్లవ కవి గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మాట్లాడారు. పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డులను ప్రధానం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షతను చూపిందన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కేవలం బిజెపికి జై కొట్టిన వాళ్లకే అవార్డులు ఇస్తాననే విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. గద్దర్ తన గలంతో తెలంగాణ ప్రజలను, యువతను ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లిన విషయం బండి సంజయ్ మంత్రి అయ్యాక మరిచారన్నారు. బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ప్రజాకవి గద్దర్ కు అవార్డును ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పీరునాకి నవీన్, మణుగూరు సబ్ డివిజన్ మండలాల యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.