24-04-2025 05:02:37 PM
తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్..
కాటారం (విజయక్రాంతి): కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్ షా(Union Home Minister Amit Shah) రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్ చేసింది. విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో మరణించినవారికి, గాయపడిన పౌరులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. కాశ్మీర్ లోని పహల్గంలో పోలీస్ వేషంలో వచ్చి విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని డిమాండ్ చేశారు.
భారత పౌరులపై జరిగిన ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరారు. ఉగ్ర దాడిలో మరణించిన వారికి కోటి రూపాయలు, గాయపడిన పౌరులకు 25 లక్షల నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని పేర్కొన్నారు. కాశ్మీర్లో ఉగ్ర దాడికి కారణమైన పాక్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలని, వాణిజ్య వ్యాపార, పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని సూచించారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో అలజడి సృష్టించడమే పాక్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులంతా ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించాలని పీక కిరణ్ పిలుపునిచ్చారు.