కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- షార్‌లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం
- రూ.3,985కోట్లు కేటాయింపు
- వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సమావేశమైన మంత్రివర్గం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు లబ్ధి చేకూరేలా 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ ఆమోదం తెలిపినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కొత్త కమిషన్‌కు చైర్మన్, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమించనున్నట్టు తెలిపారు. దీని ద్వారా సుమారు 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వం 1947 నుంచి వేతన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన ఆయన.. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన కమిషన్ 2016లో ఏర్పాటయినట్టు గుర్తు చేశారు. దీని గడువు 2026లో ముగుస్తున్నందున 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు నిర్ణ యం తీసుకున్నట్టు వివరించారు. ఈ నిర్ణయం ద్వారా 7వ వేతన సంఘం గడువు ముగియక ముందే వేతనాల పెంపుపై సిఫార్సులు పొందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
మూడో లాంచ్ ప్యాడ్..
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్‌సెంటర్(షార్)లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.3,985కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి సంబంధించిన ఎన్‌జీఎల్‌వీ, ఎల్‌ఎంవీ3 ప్రయోగాలకు అనుగుణంగా లాంచ్ ప్యాడ్ నిర్మించనున్నట్టు తెలిపారు. నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.