calender_icon.png 16 January, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధమున్నా ఆగని సరఫరా

07-07-2024 12:09:00 AM

  1. కలుపు నివారణకు ఉపయోగిస్తున్న గ్లుఫైసెట్ గడ్డి మందు 
  2. గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యాపారులు 

వికారాబాద్, జూలై 6 (విజయక్రాంతి): నిషేధిత గ్లుఫైసెట్ గడ్డిమందు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్లుఫైసెట్ గడ్డి మందు వాడితే భూసారం తగ్గి అనేక నష్టాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు పదేళ్ల క్రితమే నిషేధం విధించాయి. విక్రయాలు జరపకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. దీంతో ఏటేటా గ్లుఫైసెట్ గడ్డి మందుకు డిమాండ్ పెరుగుతోంది.

దీనితో పాటు చాలా మంది రైతులు కలుపు మందును తట్టుకుంటుందనే నమ్మకంతో హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) వెరైటీపై ఆసక్తి చూపు తున్నారు. ఈ రకమైన విత్తనాలను విత్తుకుం టే కలుపు నివారిణి గ్లుఫైసెట్ పిచికారీ చేసినా పత్తి మొక్కకు నష్టం కాకుండా గడ్డి మాత్రమే చనిపోతుందనే నమ్మకం రైతుల్లో ఉంది. ఇతర పంట విత్తనాలు విత్తుకునే ముందు దుక్కులపై గడ్డి మందును పిచికారీ చేస్తున్నారు.

ఈ గడ్డి మందు పూర్తి నిషేధం లో ఉన్నా అక్రమ మార్గంలో రైతులకు చేరుతుంది. గ్లుఫైసెట్ క్రిమి సంహారక మందును వ్యాపారులు చాటుగా తరలిస్తున్నారు. వారి షాపుల్లో కాకుండా వేరే చోట ఉంచి రైతులకు అమ్ముతున్నారు. గడ్డి మందుతో ఏటా రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగుతోంది. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారుల తో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఉన్నప్పటికీ పోలీసులే ఎక్కువగా దృష్టి సారించి ఈ దందాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

గుట్టుగా సరఫరా.. 

నిషేధిత పత్తి విత్తనాల సాగు చేపట్టినా, గ్లుఫైసెట్ గడ్డి మందు వాడినా భూసారానికి నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వాలు పది సంవత్సరాల క్రితమే నిషేధించాయి. అయినప్పటికీ వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా గడ్డి మందును సరఫరా చేస్తున్నారు. ఈ గ్లుఫైసెట్ మందు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి జిల్లాకు రవాణా అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం వేసవిలోనే కొందరు వ్యాపారులు గడ్డి మందును సరఫరా చేసుకొని గోదాముల్లో స్టాక్ పెట్టుకుంటున్నట్లు సమాచారం. స్థానికంగా రైతు లతో పరిచయం ఉన్నవారిని మధ్యవర్తిగా పెడుతూ విక్రయాలు చేస్తున్నారు.

కొందరు మధ్యవర్తులు డబ్బులకు ఆశపడి చాటుమాటున రవాణా చేస్తున్నారు. రైతులకు ఇదం తా తెలిసినప్పటికీ కలుపు బెడదతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయనే ఉద్దేశంతో గడ్డి మందు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా కొందరు రైతులైతే నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇక గ్రామాల్లో నిషేధిత విత్తనాలు, గడ్డి మందుపై పూర్తిస్థాయి లో అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారుల అలసత్వంతోనూ ఈ అక్రమా దందా ఆగడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

అవగాహన కల్పిస్తున్నాం.. 

నిషేధిత గ్లుఫైసెట్ వాడకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏఈవో లు రైతు వేదికల్లో ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. గ్లుఫైసెట్ వాడితే భూసారం దెబ్బతింటుంది. రానున్న రోజు ల్లో పంటలు పండటం ఇబ్బందిగా మారుతుంది. ఈ విషయంపై రైతుల్లో కూడా చైతన్యం రావాలి. కలుపుతీత తేలికవుతుందని రైతులు దీన్ని పిచి కారీ చేస్తున్నారు. కానీ నష్టమనే విషయాన్ని గమనించాలి. 

 గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి 

సంవత్సరం పట్టుబడిన గడ్డి మందు 

2020 910 లీటర్లు 

2021 7193 లీటర్లు 

2022 733 లీటర్లు 

2023 811 లీటర్లు