calender_icon.png 18 November, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాలకు నిరంతర విద్యుత్

29-06-2024 01:39:30 AM

విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు 

బోనాల సమీక్షలో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి) : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు నిరంతరం విద్యుత్ సరఫరా అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీజీ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. జూలై 7 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న ఆషాడ మాసం బోనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన శుక్రవారం మింట్ కాంపౌండ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలోని అన్ని దేవాలయాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రతి దేవాలయానికి ఏఈ స్థాయి అధికారిని నోడల్ అధికారి నియమిస్తున్నట్లు తెలిపారు. బోనాల ప్రారంభానికి ముందు రోజు జూలై 2న ప్రతి దేవాలయాన్ని సంబంధిత సీఈలు, ఎస్‌ఈలు సందర్శించి అక్కడి విద్యుత్ సరఫరా పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. దేవాలయాల వద్ద ఏర్పాటు చేసే లైట్లు, ఏసీలు, సౌండ్ సిస్టమ్, డిటీఆర్‌లను చెక్ చేసుకోవాలన్నారు. ఆలయాల వద్ద విద్యుత్ షాక్‌కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో ఇంచార్జ్ డైరెక్టర్లు నందకుమార్, డాక్టర్ నర్సింహులు, సీజీఎంలు కే సాయిబాబా, ఎల్ పాండ్య, వీ శివాజీ, పీ భిక్షపతి, పీ ఆనంద్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.