పోలీసులను ఆశ్రయించిన రైతు
హుజురాబాద్, (విజయక్రాంతి): గుర్తుతెలియని వ్యక్తులు చేతికొచ్చిన వరి పంటలో గడ్డి మందు కొట్టి చేతికొచ్చిన పంటను పంటను నాశనం చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని కందుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన ఎండి. కరీం అనే రైతు తనకున్న 11 గుంటల భూమిలో వరి సాగు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చే సమయానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వరి పంటలో గడ్డి మందు కొట్టారు. దీంతో పంట మొత్తం నాశనం అయిపోయింది. పంటను చూసేందుకు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన ఎండి. కరీం పంట ఎండిపోవడాన్ని గమనించాడు. ఎవరో కావాలని తన పంటకు గడ్డి మందు కొట్టి పాడు చేశారని ఆయన ఆరోపించాడు. సుమారు 30 వేల వరకు తనకు పంట నష్టం వాటిల్లినట్లు తెలిపాడు.
తాను గత 60 సంవత్సరాల నుంచి భూమిని కాస్తూ చేస్తూ జీవిస్తున్నానని అన్నాడు. తమ సమీప బంధువైన ఫాతిమా అనే మహిళ తన భూమిని నకిలీ డాక్యుమెంట్ లతో పట్టా చేసుకుందని, దీనిపై పలుమార్లు గ్రామంలో పంచాయతీ జరిగినట్లు పేర్కొన్నారు. ఫాతిమాకు ఆ భూమి వర్తించదని కరీం కి వర్తిస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నట్లు, దీంతో చేసేదేమీ లేక అట్టి భూమిని అమరేందర్ రెడ్డి అనే న్యాయవాదికి పట్టా చేసిందని వాపోయాడు. న్యాయవాది అమరేందర్ రెడ్డి తన పంటకు గడ్డి మందు కొట్టి నాశనం చేసినట్లు రోదించాడు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలంటూ హుజురాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దెబ్బతిన్న పంటను పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.