calender_icon.png 27 October, 2024 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిట్‌మెంట్‌పై ప్రశ్నతో ఆనందం లేకుండా చేశారు

23-10-2024 12:00:00 AM

కొన్ని ప్రశ్నలు నటీనటులను చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అలాంటి ప్రశ్నే ఇటీవల నటి అనన్య నాగళ్లకు ఎదురైంది. ‘పొట్టేల్’ చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్న ఆమెకు ఇబ్బందికరంగా మారింది. ‘మీరెప్పుడైనా కమిట్‌మెంట్‌ను ఎదుర్కొన్నారా?’ అని ఆమెను ప్రశ్నించారు. దీంతో అనన్య అప్పుడు గట్టిగానే సమాధానం ఇచ్చినా కూడా తరువాత మాత్రం ఆమె మనసును ఆ ప్రశ్న బాగా ఇబ్బంది పెట్టినట్టుంది.

తాజాగా ఈ అంశంపై అనన్య మరోసారి స్పందించారు. “సున్నితమైన అంశంపై నటిని ఒక వేదికపై ఇంత డైరెక్ట్‌గా ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక చాలా ఆలోచించాను. సంస్కారం ఉంటే అలాంటి ప్రశ్న అడగరనిపించింది. నటిగా గుర్తింపు కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా. చాలా మంది తల్లిదండ్రులు ‘ఇండస్ట్రీలోకి వెళ్లి మా పరువు తీసేసింది’ అని భావిస్తుంటారు.

‘పొట్టేల్’ చూశాక నా తల్లిదండ్రులు గర్వంగా ఫీలవుతారనుకున్నా. అందరితో మా కూతురు గొప్ప సినిమాలో నటించిందని చెబుతారని ఆనందించా. విలేకరి అడిగిన ప్రశ్నతో ఆనందం లేకుండా చేశారు. ఆ ఈవెంట్ చూసిన మా బంధువులంతా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టే సక్సెస్ అయ్యాననుకుంటారు.

ఈ విషయాన్ని మా అమ్మను కూడా అడుగుతారు. వాస్తవానికి ఆ విలేకరి ప్రశ్న వేసినప్పుడు నేనింత ఆలోచించలేదు. ఆమెకు సంస్కారం లేక ఇలాంటి ప్రశ్న అడిగిందనుకున్నా” అని అనన్య తెలిపారు. ఈ విషయంలో మీడియా తనకు మద్దతుగా నిలవడం ఆనందాన్నిచ్చిందని అనన్య పేర్కొన్నారు.

సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లోనూ నటీనటులను గౌరవించాలని అనన్య కోరారు. ‘మేకప్ వేసుకుని.. నవ్వుతున్నంత మాత్రాన మాకు హృదయం లేనట్టు కాదు.. ఫ్యామిలీ ఉండదని కాదు.. మమ్మల్నీ గౌరవించండి’ అని అనన్య తెలిపారు.